Anti Defection: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సాగుతున్న రాజకీయ ఫిరాయింపుల సంస్కృతిపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ నిప్పులు చెరిగారు. ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, గుర్రపు బేరాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలంటే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను పూర్తిగా రద్దు చేసి, అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికైన తర్వాత పార్టీ మారే ఏ నాయకుడిపైన అయినా కనీసం పదేళ్ల పాటు ఎలాంటి ప్రభుత్వ లేదా రాజ్యాంగబద్ధమైన పదవులు చేపట్టకుండా కఠినమైన నిషేధం విధించాలని ప్రతిపాదించారు.
కొచ్చి వేదికగా నిర్వహించిన ‘ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్’ సదస్సులో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాలు చేసి మళ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేసే లొసుగును కూడా నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని, అలాంటి వారికి కూడా పదేళ్ల వేటు నిబంధనను పక్కాగా వర్తింపజేయాలని స్పష్టం చేశారు. 2003లో ‘స్ప్లిట్’ నిబంధనను తొలగించినప్పటికీ, ఇప్పుడు ‘మెర్జర్’ (విలీనం) పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఆప్, శివసేన (యుబిటి), తృణమూల్ కాంగ్రెస్‌లలో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపిస్తూ.. ప్రజలు ఇచ్చిన తీర్పును ఇలాంటి విలీనాలు దారుణంగా దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. కేవలం శాసనసభా పక్షానికే కాకుండా మొత్తం పార్టీ విలీనమైతేనే దానికి గుర్తింపు ఉండాలనే అంశంపై తాను ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.
