బ్యాంకింగ్ రంగం కాదు అసలు ముప్పు అక్కడే! ఆర్‌బీఐ గవర్నర్ సంజాయ్ మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు

Financial Crisis

Financial Crisis

Financial Crisis: రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని కుదిపేసే తదుపరి తీవ్ర ఆర్థిక సంక్షోభం కేవలం బ్యాంకింగ్ రంగం నుంచే కాకుండా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైబర్ దాడులు లేదా తీవ్ర సాంకేతిక వైఫల్యాల వల్ల మొదలయ్యే అవకాశముందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజాయ్ మల్హోత్రా తీవ్ర హెచ్చరిక చేశారు. శనివారం జరిగిన ‘కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్’లో ఆయన ప్రసంగించారు.

ప్రపంచం ప్రస్తుతం తీవ్రస్థాయిలో పరస్పరం అనుసంధానమై ఉన్నందున, ఏదో ఒక దేశంలో తలెత్తే డిజిటల్ లేదా సైబర్ వైఫల్యాలు సరిహద్దులు దాటి ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే కొత్త వ్యవస్థాగత ప్రమాదాలుగా మారుతున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అప్పుల భారం పెరగడం, బాండ్ల రాబడుల్లో హెచ్చుతగ్గులు సంభవించడం వంటివి ప్రభుత్వాలు మరియు కార్పొరేట్ సంస్థల రుణ చెల్లింపు సామర్థ్యంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విశ్వవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లను శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంపై స్పందిస్తూ.. ఏఐ సాంకేతికత సైబర్ దాడుల తీవ్రతను పెంచడంతో పాటు మానవ పర్యవేక్షణ మరియు జవాబుదారీతనాన్ని తగ్గించే కొత్త ప్రమాదాలను తెచ్చిపెడుతోందన్నారు. ఏఐ వ్యాల్యూ చైన్‌లో పెట్టుబడులకు తగిన స్థాయిలో రాబడులు రాకపోతే గ్లోబల్ మార్కెట్లలో భారీ నష్టాలు సంభవించే ప్రమాదముందని ఆయన స్పష్టం చేశారు. దీని నివారణకు ఆర్థిక సంస్థలు, సాంకేతిక మౌలిక వసతులు, చెల్లింపు వ్యవస్థలు, థర్డ్ పార్టీ అనుసంధానాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆర్‌బీఐ గవర్నర్ సూచించారు.