NHAI: అంబులెన్స్ లేట్ అయితే రూ.10 వేల పెనాల్టీ!

అంబులెన్స్ లేట్ అయితే రూ.10 వేల పెనాల్టీ!

హైవే ప్రమాదాలపై NHAI కొత్త గైడ్ లైన్స్

కాల్ వచ్చిన 10 నిమిషాల్లో స్పాట్‌కు చేరాల్సిందే

కాల్ రిజెక్ట్ చేసినా, ఆస్పత్రికి తరలింపు ఆలస్యమైనా భారీ జరిమానా

మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 14): జాతీయ రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేందుకు భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) అత్యంత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. హైవేలపై ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే అంబులెన్స్‌లు కాలయాపన చేయకుండా వేగంగా స్పందించేలా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రమాదం జరిగిన ప్రాంతం 10 కిలోమీటర్ల పరిధిలో ఉంటే.. సమాచారం అందిన కేవలం 10 నిమిషాల్లోపు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకోవాలి (10 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటే దానికి తగినట్లుగా సమయం మారుతుంది). ఈ టైమ్ లిమిట్ పాటించడంలో విఫలమైతే ప్రతి ఘటనకు రూ.10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని జీపీఎస్ డేటా, ఎన్‌హెచ్‌ఏఐ కేర్ డ్యాష్‌బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.

రూ.10 వేల పెనాల్టీ ఎప్పుడంటే?

ప్రమాద సమాచారం అందినప్పటి నుంచి గంటలోపు బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ఆలస్యమైతే రూ.10,000 జరిమానా పడుతుంది.

అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ కాల్స్‌ను తిరస్కరిస్తే రూ.10,000 పెనాల్టీ విధిస్తారు.

అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం అంబులెన్స్‌లో ఉండాల్సిన వైద్య పరికరాలు, తగినంత మందులు, శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా మరో రూ.10,000 చొప్పున జరిమానా విధిస్తారు.

ప్రమాద సమయంలో బాధితులకు ‘గోల్డెన్ అవర్’లో అత్యవసర వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.