SHAKILA: ఫోన్ అతిగా వాడితే ఆపరేషనే! మీరు అలా చేయొద్దు !

ఫోన్ అతిగా వాడితే ఆపరేషనే!
మీరు అలా చేయొద్దు: నటి షకీలా

మినిట్ 2 మినిట్, సినిమా బ్యూరో (ఆగస్ట్ 14):  స్మార్ట్‌ఫోన్‌కు బానిసైతే ఎంతటి ప్రమాదకర పరిస్థితి ఎదురవుతుందో చెప్తూ నటి షకీలా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి తెలుపుతూ, మెడ శస్త్రచికిత్స (Surgery) చేయించుకోవడానికి కారణం మొబైల్ వాడకమేనని ఆమె వెల్లడించారు.

పడకపై పక్కకు తిరిగి పడుకుని రోజూ నాలుగైదు గంటల పాటు ఫోన్‌లో గేమ్‌లు ఆడటం, రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూడటం అలవాటుగా మారిందని ఆమె చెప్పారు. సరిగ్గా కూర్చోకుండా, మెడను ఇబ్బందికరమైన రీతిలో వంచి నిరంతరం ఫోన్ వాడటంతో మెడ నరంపై విపరీతమైన ఒత్తిడి పడి సర్జరీ వరకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. ఈ ఆపరేషన్‌కు రూ.3 లక్షల వరకు ఖర్చయిందని, శస్త్రచికిత్స తర్వాత తీవ్రమైన నొప్పి, నీరసంతో నరకం చూశానని వాపోయారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరికైనా ఇలాంటి దుస్థితే వస్తుందనే ఉద్దేశంతోనే ఆసుపత్రి నుంచి ఈ విషయాలను పంచుకున్నట్లు షకీలా స్పష్టం చేశారు.