FSSAI: సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లకు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వార్నింగ్!

ఫేక్ బ్రాండ్ల ప్రచారం చేస్తే జైలుకే!
సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లకు..
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పవర్ ఫుల్ వార్నింగ్!

మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 14): వ్యూస్, పైసల కోసం నాణ్యత లేని ఆహార ఉత్పత్తులను ప్రచారం చేసే సోషల్ మీడియా స్టార్లు, సెలబ్రిటీల ఆటలకు చెక్ పెట్టేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) రంగంలోకి దిగింది. అనుమతులు లేని, ఆరోగ్యానికి హాని కలిగించే బ్రాండ్లను ప్రమోట్ చేస్తే ఊరుకునేది లేదని ‘ఎక్స్’ వేదికగా కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.

ఏదైనా ప్రమోషన్ ఒప్పందం చేసుకునే ముందు సదరు ప్రాడక్ట్‌కు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో స్వయంగా సరిచూసుకోవడం సెలబ్రిటీల బాధ్యత అని తెగేసి చెప్పింది. కేవలం డబ్బుల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలు చేస్తే అది కేవలం పొరపాటు కాదని, చట్టప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పదిమంది అభిమానించే ప్రముఖులు బాధ్యత మరచి ప్రవర్తిస్తే ఇకపై జరిమానాలతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.