కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అనారోగ్యం.. ఆందోళనలో బీజేపీ శ్రేణులు!

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కర్ణాటకలోని హూబ్బళ్లి పర్యటనలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ముందస్తుగా నిశ్చయించిన అధికారిక కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వైద్యుల సలహా మేరకు ఆయన వెంటనే బస చేసిన హోటల్ గదిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

గబ్బూర్ పరిధిలోని ‘కెఎల్ఈ జగద్గురు గంగాధర మహాస్వామిగళు మూరుసావిరమఠ్’ వైద్య కళాశాల నూతన అకాడమిక్ భవనంతో పాటు, 1,200 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ను అమిత్ షా లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. అయితే అస్వస్థత కారణంగా ఆయన రాకపోవడంతో కేఎల్ఈ సొసైటీ ఛైర్మన్ ప్రభాకర్ కోరే ఈ విషయాన్ని సభకు వెల్లడించారు.

అమిత్ షా గైర్హాజరీతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక వైద్య విద్య విభాగాధిపతి శరణ్ ప్రకాష్ పాటిల్, బెళగావి ఎంపీ జగదీష్ శెట్టర్లు సంయుక్తంగా ఈ వైద్య సంస్థలను ప్రారంభించారు. హోంమంత్రి ఆరోగ్యం పట్ల బీజేపీ శ్రేణులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.