WAPL T20: మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) టీ-20 మొదటి సీజన్ ఘనంగా ప్రారంభమైంది. హెరిటీజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
కార్యక్రమానికి విచ్చేసిన నారా బ్రాహ్మణికి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లీగ్ బ్రాండ్ అంబాసిడర్ మిథాలీ రాజ్‌తో కలిసి నారా బ్రాహ్మణి డబ్ల్యూఏపీఎల్ విజేతల ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా బ్రాహ్మణి.. తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి యువ మహిళా క్రికెటర్లకు ఇది అద్భుతమైన వేదిక అని, భవిష్యత్ తరాలకు వీరంతా రోల్ మోడల్స్‌గా నిలుస్తారని కొనియాడారు.
ఈ లీగ్‌లో మొత్తం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఏసీఏ స్టేడియంలో ఏడు రోజుల పాటు మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ తలపడగా, సాయంత్రం రెండో మ్యాచ్‌లో అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ పోటీపడ్డాయి. నిర్వాహకులు నారా బ్రాహ్మణికి ప్రత్యేక జ్ఞాపికను అందించి సత్కరించారు. ఈ ప్రారంభ వేడుకల్లో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
