విశాఖ దాహార్తికి చెక్.. ఉత్తరాంధ్రకు లక్షల కోట్ల మేనిఫెస్టో.. సీఎం చంద్రబాబు మాస్ హామీలు

Godavari Water

Godavari Water

Godavari Water:  విశాఖపట్నం నగర దాహార్తిని తీర్చేందుకు గోదావరి జలాలను తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, నగరానికి తాగునీటి కష్టాలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. పోలవరం లెఫ్ట్ కేనాల్ ద్వారా ఇప్పటికే అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చామని, త్వరలోనే విశాఖ నగరానికి కూడా గోదావరి నీటిని అందిస్తామని తెలిపారు.

గత రెండేళ్ల వ్యవధిలోనే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏకంగా 91 ప్రాజెక్టులు వచ్చాయని, దీని ద్వారా రూ.5.37 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు తరలివచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్నారు. విశాఖ నగరం ఇప్పటికే పోర్టులు, జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టులతో కనెక్ట్ అయిందని, త్వరలోనే ఇది బహుళ ప్రాధాన్యం ఉన్న టూరిజం, లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

పర్యటన సందర్భంగా 28,445 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అంతేకాకుండా 11 మండలాల పరిధిలోని 399 ఎకరాల అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించినట్లు పేర్కొన్నారు. ఇటీవల వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు నీరందించామని గుర్తుచేసిన ఆయన, గోదావరి జలాలను వంశధార నదితో అనుసంధానించే దిశగా పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు దాపురించాయని, తన జీవితంలో 50 శాతం మేర వర్షపాతం తగ్గడం ఇదే తొలిసారి చూస్తున్నానని ఆందోళన వ్యక్తం చేశారు.