RANGAREDDY: బాలికల భద్రతే లక్ష్యం.. ‘రాఖీ బంధం’ సంతకాల ప్రచారం!

బాలికల భద్రతే లక్ష్యం.. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ‘రాఖీ బంధం’ సంతకాల ప్రచారం!

​మినిట్ 2 మినిట్, రంగారెడ్డి (ఆగస్ట్ 28):రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమంలో భాగంగా “రాఖీ బంధం – బాలికల భద్రతకు మన ప్రతిజ్ఞ” పేరిట భారీ సంతకాల ప్రచారాన్ని గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆడపిల్లల భద్రత, గౌరవం, విద్య, సమానత్వం చాటిచెప్పేలా రూపొందించిన భారీ రాఖీ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాఖీ పండుగ కేవలం తోబుట్టువుల అనుబంధమే కాకుండా, ప్రతి ఆడపిల్లనూ రక్షించి, చదివించాలనే సామాజిక బాధ్యతను గుర్తుచేస్తుందని నిర్వాహకులు తెలిపారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. బాలికలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఆడపిల్లలకు విద్య, సమాన అవకాశాలు లభించినప్పుడే సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, విద్యార్థినులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్ర రెడ్డిలు పాల్గొని బాలికల రక్షణలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

​జిల్లా సంక్షేమ అధికారి శాంతి శ్రీ పర్యవేక్షణలో జరిగిన ఈ సంతకాల ప్రచారంలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా సివిల్ సప్లైస్ అధికారి హరీష్, ట్రెజరీ అధికారి జి. సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, డి.హెచ్.ఇ.డబ్ల్యూ, ఐ.సి.పి.ఎస్ సిబ్బందితో పాటు డాన్ బోస్కో హోమ్స్ పిల్లలు పాల్గొన్నారు.