VOTE FOR NOTE: ఇదెక్కడి ట్విస్టు.. ఓటుకు నోటు కేసులో ఊహించని మలుపు !

ఇదెక్కడి ట్విస్టు!

ఓటుకు నోటు కేసులో ఊహించని మలుపు
మళ్లీ మొదటి నుంచి వాదనలు వినాలన్న సీజేఐ
పాత వాదనలను పరిగణనలోకి తీసుకోలేమని వ్యాఖ్య!
గతంలో విచారించిన న్యాయమూర్తులు రిటైర్ కావడంతో కొత్త ధర్మాసనం!
విచారణ వేగవంతానికి త్వరలోనే ప్రత్యేక బెంచ్ కేటాయింపు

మినిట్ 2 మినిట్, ఢిల్లీ(ఆగస్ట్ 14): తెలుగు రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ వ్యవహారం సుప్రీంకోర్టులో ఊహించని మలుపు తిరిగింది. గతంలో సుదీర్ఘంగా జరిగిన వాదనలతో నిమిత్తం లేకుండా, ఈ కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పాత వాదనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేయడంతో ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సాంకేతిక కారణాలు.. కొత్త ధర్మాసనం!
పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచిన ఈ ‘ఓటుకు నోటు’ పిటిషన్లపై గతంలో సుప్రీంకోర్టులో విస్తృత విచారణ జరిగింది. అప్పట్లో వాదనలు విన్న బెంచ్‌లోని నిష్ణాతులైన న్యాయమూర్తులు తీర్పు రిజర్వ్ చేసినప్పటికీ, ఆ తర్వాత వారు ఉద్యోగ విరమణ పొందారు. సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో విచారణ పూర్తి కాకుండా నిలిచిపోవడంతో, కోర్టు నిబంధనల ప్రకారం పాత వాదనలను పక్కనపెట్టి మళ్లీ ఫ్రెష్‌గా విచారించాల్సి వస్తోందని సీజేఐ స్పష్టం చేశారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ కేసులో ఇకపై ఏమాత్రం ఆలస్యం జరగకుండా వేగవంతంగా విచారించేందుకు త్వరలోనే ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కొత్త బెంచ్ ఏర్పాటు కాగానే పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలను మళ్లీ మొదటి నుంచి ఫ్రైష్‌గా వినిపించాల్సి ఉంటుంది.

ఏళ్ల తరబడి నలుగుతున్న ఈ సున్నితమైన కేసులో అత్యున్నత న్యాయస్థానం రీ-హియరింగ్‌కు ఆదేశించడంతో అటు న్యాయవాదుల్లోనూ, ఇటు రాజకీయ నాయకుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లూ ఒక కొలిక్కి వచ్చిందనుకున్న ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఈ కేసు భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తుందోనన్న ఆసక్తి రెండు రాష్ట్రాల్లోనూ మళ్లీ పెరిగింది.