నడిరోడ్డుపై నరమేధాలు.. ఇది నాగరిక సమాజమా.. ఆటవిక రాజ్యమా?

Street Crimes

Street Crimes

Street Crimes: చట్టం ఉందనే భయం లేదు, వ్యవస్థల పట్ల గౌరవం అసలే లేదు. నడిరోడ్డుపై పదునైన ఆయుధాలతో కిరాతకంగా నరికి చంపడం, ఆపై ఆ రాక్షస కృత్యాన్ని ఏదో ఘనకార్యంలా భావిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వదలడం నేటి వికృత సంస్కృతికి అద్దం పడుతోంది. అసలు మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో జీవిస్తున్నామా అనే అనుమానం సగటు పౌరుడిని తీవ్రంగా వేధిస్తోంది.

ఇటీవల యూట్యూబర్ వైష్ణవి భర్తను ఆమె సోదరుడే దారుణంగా హత్య చేసిన ఘటన మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది! దీన్ని సమర్థించే వాళ్లు సమర్థిస్తూనే ఉన్నారు. చట్టం దీనికి ఏం సమాధానం చెబుతుంది? ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అయితే నాగోల్ బండ్లగూడలో రౌడీషీటర్ల ముఠా తగాదాలు, అంతకు ముందు మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ సూరి హత్య వరకు వరుస సంఘటనలు సభ్యసమాజాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.  సూరి హత్య కేసులో నిందితుడి వీరంగానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడం చట్టవ్యవస్థ ఉనికికే సవాలు విసురుతోంది. మరోవైపు పసిపిల్లలపై అఘాయిత్యాలు, భార్యాభర్తల హత్యోదంతాలు నిత్యకృత్యమైపోయాయి. ఈ కిరాతక చర్యలను కూడా సామాజిక మాధ్యమాల్లో సమర్థించే దారుణమైన మనస్తత్వాలు పెరిగిపోతుండటం సమాజానికి పెద్ద విపత్తుగా మారింది.

మన దేశంలో చట్టాలకు ఏమాత్రం కొదవ లేదు, కానీ వాటి అమలులో జరుగుతున్న తీవ్ర జాప్యమే నేరస్థులకు కవచంగా మారుతోంది. నేరం చేసిన వెంటనే శిక్ష పడుతుందనే భయం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. సుదీర్ఘ కాలం సాగే కోర్టు విచారణలు, ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థల కొరత నేరస్థులకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు వ్యవస్థ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై కఠినమైన నిఘా లోపించడం, స్థానిక గ్యాంగుల సంస్కృతిని ఆదిలోనే తొక్కేయకపోవడం నగరంలో శాంతిభద్రతలను పూర్తిగా దిగజారుస్తోంది.

ఈ ప్రతీకారేచ్ఛ, నేర సంస్కృతి ఇలాగే కొనసాగితే సమాజ భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడే అవకాశముంది. తక్షణమే శిక్షలు అమలు చేసేలా న్యాయ, పోలీసు వ్యవస్థల్లో విప్లవాత్మక సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపడంతో పాటు పాలకులకు శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యత కావాలి. అప్పుడే సమాజంలో ప్రశాంత వాతావరణం మళ్లీ నెలకొంటుంది.