Phone Smuggling: షాపుల షట్టర్లు పగలగొట్టడం, కళ్లెదుటే ఉన్న ఖరీదైన సెల్‌ఫోన్లను ఊడ్చేయడం, ఆపై సరిహద్దులు దాటించి ఇతర దేశాల్లో అమ్మేయడం! భారీ ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఒక పెద్ద సెల్‌ఫోన్ దొంగల ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ బంగ్లాదేశ్‌కు ఫోన్లు తరలిస్తున్న 9 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. నిందితుల దగ్గరి నుంచి రూ.22 లక్షల నగదు, 15 ఖరీదైన మొబైల్ ఫోన్లు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
బంజారాహిల్స్ టీజీసీసీసీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. లంగర్‌హౌస్‌కు చెందిన మహమ్మద్ తబ్రేజ్, మహమ్మద్ రఫీకులు రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో పశువుల దొంగతనాలు చేసి విక్రయించేవారు. అయితే ఇటీవల పశువుల లభ్యత తగ్గడం, అను అనుకున్నంత లాభాలు రాకపోవడంతో దొంగతనాల రూట్ మార్చారు. తబ్రేజ్ తన పాత పరిచయస్తుడైన ఫర్హాన్‌ను సంప్రదించి, సెల్‌ఫోన్ల చోరీ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
ఈ ముఠా ముందుగా విజయవాడలోని ఒక బిగ్ సి దుకాణంలో చోరీకి యత్నించి విఫలమైంది. ఆ తర్వాత ఖమ్మంలోని ఫోన్‌విజన్ షాప్‌లో చొరబడి భారీగా సెల్‌ఫోన్లను దొంగిలించింది. వాటిని ఫర్హాన్ సహాయంతో ముంబయికి చెందిన మెహబూబ్ షేక్, ముబీన్ షేక్‌లకు రూ.20 లక్షలకు విక్రయించింది. ఆ తర్వాత ఈ ముఠా సభ్యులు ముంబయికి మకాం మార్చారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని మొబైల్ షాపుల్లోనూ వరుస చోరీలకు తెగబడ్డారు.
ఇలా దొంగిలించిన ఫోన్లను ముంబయి ముఠా కొనుగోలు చేసి, జావహెద్ ఖాన్ అలియాస్ రాజ్ భాయ్, అతడి అనుచరుల ద్వారా కోల్‌కతాకు చేరవేసేది. అక్కడి నుంచి సముద్ర మార్గంలో బంగ్లాదేశ్‌కు తరలించి, అక్కడ అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించేవారు. ఇలా ప్రతి నెలా దాదాపు 500 ఫోన్లను బంగ్లాదేశ్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కొత్త వోక్స్‌వాగన్ కారులో హైదరాబాద్‌కి రాగా, విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేశారు.
