80 ఏళ్ల స్వతంత్ర భారతంలో మారిన ప్రజల ఆర్థిక స్థితిగతులు
ప్రాథమిక అవసరాల నుంచి ప్రీమియం జీవితానికి ప్రయాణం
సంప్రదాయ పొదుపు నుంచి ఈక్విటీలు, సిప్ల వైపు భారతీయుల అడుగులు
మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ(ఆగస్ట్ 15): భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో, ప్రజల ఆలోచనా విధానంలో, ఆర్థిక అలవాట్లలో విప్లవాత్మక మార్పులు నమోదయ్యాయి. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో పేదరికం, నిరక్షరాస్యత, ఆహార అభద్రత కారణంగా కుటుంబాల ఆదాయం కేవలం కూడు, గుడ్డ, నీడ వంటి ప్రాథమిక నిత్యావసరాలకే పరిమితమయ్యేది. కానీ, ఈ 79 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ మధ్యతరగతి వర్గం స్థిరత్వాన్ని కోరుకునే స్థాయి నుంచి సంపదను సృష్టించే స్థాయికి ఎంతో వైభవంగా ఎదిగింది. ఒకప్పుడు స్కూటర్ కొనడమే గొప్పగా భావించిన కుటుంబాలు.. నేడు ఆధునిక ఎలక్ట్రిక్ కార్లు, ప్రీమియం మోడళ్లను కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాయి.
పెరుగుతున్న ఆదాయాలు, వేగవంతమైన పట్టణీకరణ, డిజిటలైజేషన్ ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కడుపు నింపుకోవడానికి చేసే ఖర్చుల వాటా తగ్గి, ఆ మిగులు డబ్బును మెరుగైన ఆరోగ్యం, విద్యావసతులు, ఎలక్ట్రానిక్స్, రవాణా, వినోద రంగానికి ఉపయోగిస్తున్నారు.
మాస్ టు ప్రీమియం సెక్టార్:
వాహన కొనుగోళ్లలో కేవలం ఎంట్రీ లెవెల్ కార్లకే పరిమితం కాకుండా ప్రీమియం వేరియంట్లు, సకల సౌకర్యాలున్న ఎస్యూవీలను (SUV) సొంతం చేసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. రూ.30 వేలకు పైబడిన ప్రీమియం స్మార్ట్ఫోన్ల వాటా 2020లో 20 శాతంగా ఉండగా, 2025 నాటికి అది 26 శాతానికి పెరగడం ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ధనికులకే పరిమితమైన అంతర్జాతీయ విదేశీ ప్రయాణాలు ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయాయి. 2025లోనే భారతీయులు రికార్డు స్థాయిలో 32.83 మిలియన్ల విదేశీ పర్యటనలు చేశారు. సంగీత కచేరీలు, స్పోర్ట్స్ లైవ్ ఈవెంట్స్పై కూడా ఖర్చులు పెరిగాయి.
పొదుపు నుంచి పెట్టుబడుల వైపు..
తరతరాలుగా బ్యాంకు డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్ లాంటి సంప్రదాయ పొదుపు మార్గాలకే పరిమితమైన భారతీయులు.. ఇప్పుడు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. 2017లో నెలకు రూ.4,000 కోట్ల కంటే తక్కువగా ఉన్న సిప్ (SIP) కంట్రిబ్యూషన్లు, 2026 నాటికి ఏకంగా రూ.28,000 కోట్లకు చేరుకోవడం విశేషం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల సంఖ్య 2020లో 3.1 కోట్లు ఉండగా, 2025 నాటికి 11 కోట్లకు పైగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక వృద్ధి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 నగరాలకు వేగంగా విస్తరిస్తూ దేశ పురోగతికి ఊతమివ్వనుంది.
