KA Paul: ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధాల ఉన్మాదానికి అడ్డుకట్ట వేసేందుకు, మానవత్వ పరిరక్షణే పరమావధిగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్టన్ వేదికగా ‘గ్లోబల్ పీస్ అండ్ ఎకనమిక్ సమ్మిట్’ ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ప్రపంచ శాంతి దూత, డాక్టర్ కేఏ పాల్ నేతృత్వంలో జరిగిన ఈ అంతర్జాతీయ సమ్మేళనం ప్రపంచ దౌత్య వర్గాల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ మైక్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికా, ఇండియా, ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఉక్రెయిన్, రష్యా, కాంగో సహా పలు దేశాల అగ్రనేతలు, దౌత్యవేత్తలు, వివిధ మతాలకు చెందిన మతపెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య రగులుతున్న తీవ్ర ఉద్రిక్తతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న 58 రకాల యుద్ధ పోరాటాలను తక్షణమే నిలిపివేయడమే ఈ సమ్మేళనం ప్రధాన లక్ష్యం. యుద్ధాల వల్ల 197 దేశాల్లో ఉన్న 800 కోట్ల జనాభా ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర నష్టానికి గురవుతోందని ఈ వేదిక హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్‌ను కేవలం రాజకీయ విమర్శలకు, మీమ్స్‌కు పరిమితం చేస్తూ చిన్నచూపు చూసే వర్గాలు ఆయన అంతర్జాతీయ పరిధిని గుర్తిస్తే ఆశ్చర్యపోక తప్పదు. గతంలో లైబీరియాలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు చార్లెస్ టేలర్‌ను రాజీనామాకు ఒప్పించి, దేశాన్ని రక్తాపాతం నుంచి కాపాడటంలో కేఏ పాల్ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా, హైతీలో తిరుగుబాటుదారుల నాయకుడు గై ఫిలిప్‌ను ఆయుధాలు వీడేలా ఒప్పించడం, సుడాన్ అంతర్యుద్ధ నివారణకు ఆ దేశ అధ్యక్షుడు అల్-బషీర్‌తో సుదీర్ఘ చర్చలు జరపడం, లిబియా సంక్షోభం వేళ శాంతి రాయబారం నడపడం వంటి అనేక సంఘటనలు ఆయనలోని దౌత్య సామర్థ్యానికి ప్రతీకలు.
సరిహద్దులు, వ్యంగ్య వ్యాఖ్యలను దాటుకుని వాషింగ్టన్ లాంటి ప్రపంచ దిగ్గజ కేంద్రంలో అమెరికా కాంగ్రెస్ స్పీకర్ వంటి దిగ్గజాలతో ఒకే వేదిక పంచుకోగల సామర్థ్యం ఆయన సొంతం. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులతో సుదీర్ఘకాలంగా శాంతి చర్చలు జరిపిన అనుభవం ఆయన నిగూఢ రాజనీతికి నిదర్శనం.
ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దౌత్యవేత్త. ప్రాంతీయ రాజకీయ దురభిప్రాయాలను పక్కనపెట్టి చూస్తే, ప్రపంచంలో కల్లోలం రేగుతున్న ఈ క్లిష్ట సమయంలో శాంతి పతాకాన్ని ఎగురవేస్తూ కేఏ పాల్ చేస్తున్న కృషి అభినందనీయం. విశ్వశాంతి కోసం ఒక తెలుగువాడు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ మహా ఉద్యమం, ఆయనలోని శాంతిదూతను, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన గ్లోబల్ ఫిగర్‌ను మరోసారి ప్రపంచం ముందు నిలబెడుతోంది.
