BRICS India: బ్రిక్స్ (BRICS) అంతర్జాతీయ వేదికపై భారతదేశం వహిస్తున్న క్రియాశీలక పాత్ర, అంతర్జాతీయ సమాజంలో మన దేశం సాధించిన దౌత్య, వ్యూహాత్మక ప్రగతికి స్పష్టమైన నిదర్శనమని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా ప్రతినిధి పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు విశ్లేషించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కేవలం సదస్సులలో పాల్గొనడమే కాకుండా, ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలను చూపే స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల బహుపాక్షిక ప్రయోజనాలను కాపాడటంలో భారత్ చూపుతున్న చొరవను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల) హక్కులు మరియు ఆకాంక్షల తరఫున మాట్లాడే బలమైన గొంతుకగా భారత్ నిలిచింది. ఉగ్రవాదంపై ఎలాంటి రాజీ లేని “జీరో టాలరెన్స్” విధానాన్ని స్పష్టం చేయడంతో పాటు, ప్రపంచ స్థాయిలో ఆర్థిక స్థిరత్వం కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థలను (Cross-border payments) బలోపేతం చేయడం వంటి ఆర్థిక సంస్కరణలను భారత్ సమర్థవంతంగా ప్రతిపాదించింది. ఇవి రాబోయే రోజుల్లో ప్రపంచ వాణిజ్యాన్ని మరింత సరళతరం చేయడానికి తోడ్పడతాయి.
మరోవైపు, దేశీయంగా ప్రతి వర్గానికి లబ్ధి చేకూరేలా అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకోవడంలో ప్రధాని మోదీ చాకచక్యం స్పష్టమవుతోంది. ముఖ్యంగా మన రైతులు, చిన్న-మధ్యతరహా పరిశ్రమల (MSME) ప్రయోజనాలను పరిరక్షించడం, వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆధునిక సాంకేతికతను జోడించడం, గ్లోబల్ హెల్త్ కోఆపరేషన్ (ఆరోగ్య సహకారం) పెంపొందించడం వంటి విషయాలలో భారత్ తీసుకున్న చొరవ అభినందనీయం. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో తక్షణ సంస్కరణలు తీసుకురావాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని భారత్ చేస్తున్న డిమాండ్‌కు బ్రిక్స్ వేదిక ద్వారా మరింత బలం చేకూరింది.
ఒకప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు లేదా నిర్ణయాలను కేవలం అనుసరించే స్థితిలో ఉన్న భారతదేశం, నేడు ప్రపంచ వేదికలపై నిర్ణయాల రూపకల్పనను (Decision Making) నిర్దేశించే స్థాయికి ఎదిగిందని కృష్ణకాంత్ గారు పునరుద్ఘాటించారు. బలమైన ఆర్థిక పురోగతి, స్వతంత్ర విదేశాంగ విధానం, మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా భారత్ అంతర్జాతీయ రాజకీయంలో ఒక కీలక శక్త్యత్మక ధృవంగా మారిందని ఈ బ్రిక్స్ సదస్సు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
