జనాభా పెంచేందుకు సర్కార్ డేటింగ్ ప్లాన్.. సింగపూర్ వినూత్న ప్రయోగం!

First Date

First Date

First Date: దేశంలో రోజురోజుకూ పడిపోతున్న సంతానోత్పత్తి రేటును అదుపులోకి తెచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. క్షీణిస్తున్న జనాభాను పెంచే లక్ష్యంతో 21 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ఫస్ట్ డేట్’ పేరిట అధికారిక మ్యాచ్‌మేకింగ్, డేటింగ్ సేవలను ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.

ఈ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ నోబెల్ బహుమతి పొందిన ‘గేల్-షేప్లీ అల్గారిథమ్’ ఆధారంగా పనిచేయడం విశేషం. సాధారణ డేటింగ్ యాప్‌లలా కాకుండా, ఇందులో ప్రతి దశలోనూ ఒకే భాగస్వామితో ముఖాముఖి డేట్ ఏర్పాటయ్యేలా దీని సాంకేతికతను రూపొందించారు. భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రొఫైళ్ల నకిలీలను అరికట్టేందుకు సింగపూర్ జాతీయ డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ ‘సింగ్‌పాస్’ (Singpass) ద్వారా లాగిన్ అయ్యేలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను అనుసంధానించారు.

జనాభా తగ్గుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నేరుగా ఉద్యోగుల మధ్య సంబంధాలు కుదిర్చే బాధ్యత తీసుకోవడంపై అక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రభుత్వ జోక్యం సరికాదని కొందరు విమర్శిస్తుండగా.. నేటి ఆధునిక జీవనశైలి, బిజీ లైఫ్‌లో సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ఇదొక విశ్వసనీయమైన, సురక్షితమైన వేదికగా ఉపయోగపడుతుందని మరికొందరు స్వాగతిస్తున్నారు. జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు సింగపూర్ ప్రభుత్వం వేసిన ఈ అడుగు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.