ప్రాణాలకు తెగించి ఏనుగు దూడను కాపాడిన మత్స్యకారులు

Elephant Rescue

Elephant Rescue

Elephant Rescue: పశ్చిమ బెంగాల్‌లోని గజోల్డోబా సమీపంలో ప్రవహించే ఉధృతమైన తీస్తా నదిలో ప్రకృతి సృష్టించిన విపత్కర పరిస్థితుల్లోనూ మానవత్వం పరిమళించింది. అపల్‌చంద్ అడవిలోని కతాంబరి రేంజ్ ప్రాంతం గుండా ఏనుగుల గుంపు నదిని దాటుతుండగా, కేవలం మూడు నాలుగు రోజుల వయసున్న పసి దూడ ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. సుమారు నాలుగు కిలోమీటర్ల దిగువన ఉద్ధృతంగా పారుతున్న నీటిలో ఆ చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతుండగా గమనించిన ఐదుగురు స్థానిక జాలర్లు (బాబు దాస్, మిథున్ దాస్, ఖాదర్ దాస్, విశ్వనాథ్, గోపాల్) ఏమాత్రం ఆలోచించకుండా తమ చిన్న పడవతో రంగంలోకి దిగారు. ఉరుములు ఉరిమేలా దూసుకొస్తున్న నది ప్రవాహాన్ని లెక్కచేయకుండా, ఊపిరి ఆడక చిన్న తొండం పైకి ఎత్తి ఆర్తనాదాలు చేస్తున్న ఆ మూగజీవం దగ్గరకు పడవను చేర్చారు. వారిలో ముగ్గురు ధైర్యంగా నీటిలోకి దూకి ఆ దూడను ఎత్తి పడవపైకి చేర్చగా, మిగతావారు భగభగ మనే ప్రవాహంలో ఈదుకుంటూ పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి నిజమైన హీరోలుగా నిలిచారు.

అటవీ శాఖ సమన్వయంతో మాతృమూర్తి చెంతకు చేరిక

ఒడ్డుకు చేర్చిన వెంటనే ఆ చిన్నారి దూడను అటవీ సిబ్బందికి అప్పగించగా, వారు వెంటనే దానిని కతాంబరి రేంజ్ ఆఫీసుకు తరలించి అత్యవసర పశువైద్య చికిత్స అందించారు. ఆ తర్వాత బైకుంఠపూర్ అటవీ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి తల్లి ఏనుగు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. బ్యారేజీ దాటించి తీస్తా నదిలోని ఎండిన ఇసుక మేటల ప్రాంతానికి దూడను సురక్షితంగా తీసుకెళ్లగా, అక్కడ ఆ గుంపు తలదాచుకుని ఉంది. అటవీ సిబ్బంది, స్థానికులు, మత్స్యకారులు కలిసి సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు ఆ పసి దూడను దాని కన్నతల్లి చెంతకు చేర్చడంలో విజయం సాధించారు. మానవ స్పర్శ ఎక్కువసేపు ఉంటే తల్లి ఏనుగు దూడను తిరస్కరించే ప్రమాం ఉందని నిపుణులు చెబుతున్న తరుణంలో, ఈ రెస్క్యూ టీమ్ అత్యంత వేగంగా స్పందించి చేసిన ఈ అద్భుతమైన సాహసం అందరి ప్రశంసలను అందుకుంటోంది. తల్లి ఏనుగు తన బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని పాలిస్తున్న దృశ్యం అక్కడివారందరి కంట తడిపెట్టించింది.