* హాయిగా వ్యాపారాలు సాగాలంటే గులాంగిరీ చేయాల్సిందేనా?
* పారిశ్రామిక, మీడియా రంగాల్లో గూడు కట్టుుకున్న భయం
* కాదు కూడదంటే ఏ నోటీసు వస్తుందనే ఆందోళన
* చివరికి గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ది ఇదే తీరు
మినిట్ 2 మినిట్, పొలిటికల్ డెస్క్(ఆగస్ట్ 08): వర్తమాన భారత రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ ఒక అస్పష్టమైన, తీవ్రమైన ఆందోళన నిశ్శబ్దంగా విస్తరిస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధానాలపై విమర్శలు గుప్పించడం ఏ రంగానికైనా అంత సులభం కాదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే ఎంతటి బలీయమైన శక్తి అయినా మూల్యం చెల్లించుకోక తప్పదన్న చర్చ జరుగుతోంది. ఇటీవల దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఏ నోటీసు వస్తుందోననే భయం!
ఒకప్పుడు ప్రభుత్వ విధానాలలోని లోటుపాట్లను ఎండగట్టడంలో ముందుండే ముందుండే మెయిన్ స్ట్రీమ్ మీడియా, నేడు తీవ్రమైన ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. నిబంధనల ఉచ్చు, ప్రకటనల ఉపసంహరణ, దర్యాప్తు సంస్థల తనిఖీల భయంతో కేంద్ర నిర్ణయాలపై గళమెత్తలేని ధీన స్థితికి చేరుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భిన్నాభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునే వేదికలుగా భావించే గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సైతం కఠినమైన ఐటీ రూల్స్, చట్టపరమైన నోటీసుల ముందు మోకరిల్లాల్సి వస్తోంది.
కార్పొరేట్లు, పరిశ్రమల మౌన ముద్ర!
ఈ భయానక వాతావరణం కేవలం మీడియాకే పరిమితం కాలేదు. బడా వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంఘాలు కూడా ప్రభుత్వ విధానాలకు జై కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. బతికి బట్టకట్టాలంటే, వ్యాపారాలు సాఫీగా సాగాలంటే ప్రభుత్వ నిర్ణయాలకు గుడ్డిగా మద్దతు ఇవ్వాల్సిందేననే వాతావరణం నెలకొంది.
SIAM ‘యూ-టర్న్’ సజీవ సాక్ష్యం!
దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల వెలుగుచూసిన SIAM (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్) వ్యవహారం! కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న E20 పెట్రోల్ (ఇథనాల్ బ్లెండింగ్) వల్ల వాహన ఇంజన్లు పాడవుతున్నాయని జూలై చివరి వారంలో లేఖ రాసిన ఆటోమొబైల్ దిగ్గజాల సంస్థ… సరిగ్గా వారం తిరిగేసరికి (ఆగస్టు మొదటి వారంలో) ప్లేట్ ఫిరాయించింది! మీడియా తన లేఖను తప్పుగా వ్యాఖ్యానించిందని సమర్థించుకుంటూ, ప్రభుత్వ E20 విధానానికి పూర్తి మద్దతు ఉందంటూ” బహిరంగంగా లేఖ ఉపసంహరించుకుంది. దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీల కూటమి సైతం వారం వ్యవధిలోనే యూ-టర్న్ తీసుకోవాల్సి వచ్చిందంటే పారిశ్రామిక రంగంలో గూడుకట్టుకున్న భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచే సాధనం. కానీ, నేడు ఏ చిన్న విమర్శ చేసినా చుట్టుముట్టే పరిణామాలు, పొంచివున్న హెచ్చరికల నీడలో పారిశ్రామిక, ప్రసార రంగాలు మౌనమే శరణ్యమని భావిస్తున్నాయనడంలో సందేహం లేదు.
