కరువు ఛాయల్లో తెలంగాణ.. తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్ నినో.. తక్షణ చర్యలకు రేవంత్ ప్రభుత్వం శ్రీకారం

Telangana Drought

Telangana Drought

Telangana Drought:  తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకరంగా మారుతున్న ఎల్ నినో పరిస్థితులు, కరువు ముప్పు మరియు భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులపై సమగ్ర నివేదికను సీఎంకు సమర్పించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 320 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అందులోనూ 117 మండలాల్లో తీవ్రమైన కరువు తాండవిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీఎం సలహాదారు రామకృష్ణారావు ఎల్ నినో తీవ్రత, దాని వల్ల కలిగే భయంకర ప్రభావాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ

తీవ్రమవుతున్న కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను, రైతాంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించేందుకు గాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కమిటీ కరువు పరిస్థితులను అధిగమించడానికి, తాగునీరు, సాగునీటి ఎద్దడి రాకుండా చూడటంతో పాటు పంట నష్ట నివారణకు సమగ్రమైన ‘రోడ్ మ్యాప్’ సిద్ధం చేయనుంది. ఈ కమిటీ తక్షణమే తన తొలి సమావేశాన్ని నిర్వహించనుంది.

ఎకరానికి రూ. 10 వేల పరిహారం?

మరోవైపు ఎల్ నినో తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్రంలో ఇప్పటికే 11.18 లక్షల ఎకరాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని ప్రభుత్వ యంత్రాంగం తేల్చింది. నిరాశలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు గాను ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఇందుకోసం సుమారు రూ. 1,118 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. కరువు బారిన పడిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం త్వరితగతిన ఉపశమన చర్యలు చేపట్టనుంది.