Food Safety: పండుగలు, శుభకార్యాల వేళ ఎంతో ఇష్టంగా తినే స్వీట్లపై మెరిసే వెండి పొర (సిల్వర్ వర్క్) వెనుక దాగి ఉన్న భయంకరమైన కల్తీ దందా హైదరాబాద్‌లో బట్టబయలైంది. స్వచ్ఛమైన వెండి పొరకు బదులుగా ప్రమాదకరమైన అల్యూమినియం రేకులను సిల్వర్ రేపర్స్ పేరుతో విక్రయిస్తున్న ముఠాను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు.
చార్మినార్ కేంద్రంగా కల్తీ దందా
నగరంలోని ఓ రహస్య ప్రాంతంలో నకిలీ సిల్వర్ రేపర్స్ తయారవుతున్నాయన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్ నుంచి అల్యూమినియం ముడిసరుకును తెప్పించుకుని, చార్మినార్ కేంద్రంగా ఈ కల్తీ తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రత్యేక యంత్రాల సాయంతో అల్యూమినియం షీట్లను అత్యంత పల్చగా మార్చి, అచ్చం ఒరిజినల్ సిల్వర్ రేపర్స్ మాదిరిగా ఉండే ప్యాకింగ్ కవర్లలో ఉంచి మార్కెట్లోకి తరలిస్తున్నారు.
ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా!
ఈ దాడుల్లో నిందితుల వద్ద నుంచి లక్షల రూపాయల విలువైన 49 బండిళ్ల (13 కిలోలకు పైగా) నకిలీ సిల్వర్ రేపర్స్తో పాటు, అల్యూమినియం ముడిసరుకు, ప్యాకింగ్ మెటీరియల్, తయారీ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరు తయారు చేసిన ఈ నకిలీ సిల్వర్ కోటింగ్‌ను నగరంలోని పలు ప్రముఖ స్వీట్ షాపులకు సైతం సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఏయే దుకాణాలకు వీటిని విక్రయించారనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. స్వచ్ఛమైన వెండి పొర ఆరోగ్యానికి హాని చేయదు కానీ, అల్యూమినియం రేకులతో కూడిన స్వీట్లు తినడం వల్ల శరీరంలోకి విషపూరిత లోహాలు చేరుతాయని సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజలకు తీవ్రమైన కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, స్వీట్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
