AI Clinic: సూది గుచ్చకుండా, బొట్టు రక్తం తీయకుండా కేవలం 60 సెకన్లలోనే 60 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అత్యాధునిక ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ఏరోస్ వెల్నెస్ ఏఐ క్లినిక్’ను అధికారులు ప్రారంభించారు. దేశంలో గుజరాత్, ఉత్తరాఖండ్ తర్వాత ఈ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్న మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఈ సాంకేతికతలో రోగి కెమెరా ముందు నిలబడగానే నాడి సంకేతాలు, ముఖంలో వచ్చే సూక్ష్మ మార్పులను ఏఐ విశ్లేషించి 28 రకాల ప్రాథమిక పరీక్షల ఫలితాలను గుర్తిస్తుంది. ఆపై ఐఓటీ టెక్నాలజీ ద్వారా మరో 32 రకాల పరీక్షలు పూర్తి చేసి, మొత్తం 60 రకాల డిజిటల్ రిపోర్టులను ఒకే నిమిషంలో అందిస్తుంది.
ఈ విధానం ద్వారా బీపీ, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే సులభంగా పసిగట్టవచ్చని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ ప్రయోగం విజయవంతమైతే, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
