Vasavi Ananda Nilayam: ఎల్బీ నగర్లోని వాసవి ఆనంద నిలయం ప్రాజెక్ట్ నిర్మాణాల్లో తీవ్ర ఆలస్యానికి, పనులు ముందుకు సాగకపోవడానికి స్థానిక రాజకీయ నాయకుల జోక్యమే ప్రధాన కారణమంటూ సంస్థ ఛైర్మన్ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. శనివారం కస్టమర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజకీయ నాయకుల వేధింపులు కూడా ప్రాజెక్ట్ మందగించడానికి ఓ కారణమన్నట్టు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ పేరును ఛైర్మన్ ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు రాజకీయ నాయకులు వాసవి గ్రూప్ నుంచి వసూళ్లు రాబట్టారని, దీనివల్లే ఆనంద నిలయం ప్రాజెక్ట్ ఆర్థిక ఇబ్బందుల్లో పడిందనే ప్రచారం వినిపిస్తోంది.
అయితే, రాజకీయ నాయకుల వసూళ్లు, యాజమాన్యం చెబుతున్న అంతర్గత కారణాల వెనకున్న నిజానిజాలు ఏమైనప్పటికీ.. ఏళ్లుగా ఇండ్లు రాక, కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణల నడుమ తమ సొంతింటి కల తీరని వ్యథగా మారిందని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ప్రాజెక్టును పూర్తి చేయించి తమకు న్యాయం చేయాలని కస్టమర్లు కోరుతున్నారు.
