సినీ దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత!

Srinivasa Rao

Srinivasa Rao

Srinivasa Rao: భారతీయ చలనచిత్ర రంగానికి చెరగని గుర్తింపు తెచ్చిన ప్రముఖ దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

భారతీయ సినిమాలో వినూత్న ప్రయోగాలకు ఆద్యుడిగా పేరుగాంచిన సింగీతం శ్రీనివాసరావు.. మాటలు లేని మూకీ చిత్రం ‘పుష్పక విమానం’, టైమ్ ట్రావెల్ కథాంశంతో ‘ఆదిత్య 369’, అద్భుత జానపద చిత్రం ‘భైరవద్వీపం’, సుధాచంద్రన్ బయోపిక్ ‘మయూరి’ వంటి ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించారు. కమల్ హాసన్‌తో కలిసి ‘అపూర్వ సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ అందించి ప్రేక్షకులను అపరిమితంగా అలరించారు.

94 ఏళ్ల నిండు వయసులో కూడా ఆయన సినిమాపై ఉన్న అపరిమితమైన అభిరుచితో దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించి అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ దర్శకుడు-నిర్మాత నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’ అనే చిత్రానికి ఆయన ఆఖరిగా దర్శకత్వం వహించడం విశేషం. వయసును సైతం లెక్కచేయక చివరి శ్వాస వరకు కళారంగానికే అంకితమైన సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.