నల్సార్ స్నాతకోత్సవ వివాదం
సీజేఐకి ఆహ్వానంపై విద్యార్థుల తీవ్ర నిరసన
ఒక పూట భోజనం బంద్!
మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 10): హైదరాబాద్‌లోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయం ‘నల్సార్’ స్నాతకోత్సవ ముఖ్య అతిథి ఎంపిక తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాబోయే స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా పిలవడాన్ని నల్సార్ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనను ఆహ్వానించవద్దని డిమాండ్ చేస్తూ 450 మందికి పైగా విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను వర్సిటీ యాజమాన్యానికి అందజేశారు.
అసంతృప్తికి కారణమిదే
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నీట్ (NEET) ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిపై దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలే ఈ ఆగ్రహానికి కారణమయ్యాయి. విచారణ సందర్భంగా పోలీసుల దాడికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని న్యాయవాదులు తెలపగా.. “వీడియోలు చూసి సమయం వృథా చేయలేము” అని సీజేఐ వ్యాఖ్యానించడాన్ని విద్యార్థులు తప్పుబడుతున్నారు. గతంలో ఆయన దేశ యువతను ఉద్దేశించి ‘పారాసైట్లు, కాక్రోచ్‌లు (జలగలు, జెర్రులు)’ అని పోల్చారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
నిరసన దిశగా విద్యార్థులు
రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులను బోధించే న్యాయ కళాశాల స్నాతకోత్సవంలో హక్కుల ఉల్లంఘనలపై ఉదాసీనంగా వ్యవహరించిన వ్యక్తి నుంచి డిగ్రీలు తీసుకోవడానికి తమ మనస్సాక్షి అంగీకరించడం లేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి నిరసనగా పలువురు విద్యార్థులు ఒక పూట భోజనాన్ని సైతం మానేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ విన్నపాన్ని పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) కూడా సీజేఐ పర్యటనపై విద్యార్థుల నిరసనల నేపథ్యంతో స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకున్న విషయాన్ని నల్సార్ విద్యార్థులు ప్రస్తావిస్తున్నారు.
