UPI Free: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ఊపిరిపోసిన యూపీఐ లావాదేవీలపై కొత్తగా ఎలాంటి రుసుములు విధించవద్దని నీతి ఆయోగ్ మాజీ వైస్-ఛైర్మన్, ప్రముఖ అర్థశాస్త్రవేత్త రాజీవ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కనీసం మరికొన్నేళ్ల పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ‘జీరో-ఛార్జీ’ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని స్పష్టం చేశారు. యూపీఐని కేవలం ఒక చెల్లింపుల వ్యవస్థగా కాకుండా దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడే మౌలిక సదుపాయంగా గుర్తించాలని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఖర్చు కంటే ప్రయోజనాలే ఎక్కువ!
యూపీఐ మౌలిక సదుపాయాల నిర్వహణ, భద్రత కోసం ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు రూ.20,000 కోట్ల భారం పడుతున్న మాట నిజమేనని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అయితే ఆ ఖర్చుతో పోలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార వర్గాలకు చేకూరుతున్న విస్తృత ప్రయోజనాలు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వల్ల వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని, కరెన్సీ నోట్ల నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు పన్ను పరిధి కూడా విస్తరించిందని గుర్తుచేశారు.
మళ్లీ నగదు లావాదేవీల వైపు మళ్లే ప్రమాదం!
యూపీఐపై చాలా స్వల్ప మొత్తంలో ఫీజు విధించినా, వ్యాపారులు లేదా వినియోగదారులు డిజిటల్ చెల్లింపులను పక్కనపెట్టి మళ్లీ పాత పద్ధతిలో నగదు (క్యాష్) వైపే మళ్లే అవకాశం ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటి వరకు సాధించిన డిజిటల్ పురోగతి దెబ్బతినకుండా ఉండాలంటే కరెన్సీ-టు-జీడీపీ నిష్పత్తి క్రమంగా తగ్గుముఖం పట్టే వరకు యూపీఐని పూర్తిగా ఉచితంగానే అందుబాటులో ఉంచడం శ్రేయస్కరమని సూచించారు.
లావాదేవీల విలువలో పెద్ద వ్యాపారాలే ఎక్కువున్నాయి
యూపీఐ లావాదేవీల సంఖ్య పరంగా చూస్తే 96 శాతం రూ.2,000 కంటే తక్కువ విలువైనవే ఉన్నప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో దాదాపు 66 శాతం రూ.2,000 దాటిన పెద్ద చెల్లింపులే ఉన్నాయని ఆర్థిక విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పేరుతో రుసుములు విధిస్తే డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న చిన్న, మధ్యతరహా వ్యాపారులు మళ్లీ వెనక్కి తగ్గే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ప్రస్తుత యథాతథ స్థితిని కొనసాగిస్తూ డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడమే సరైన మార్గమని స్పష్టం చేశారు.
