వాట్సాప్ స్టేటస్ నింపేస్తున్నారా? చాణక్య నీతి ఏం చెప్తోందో తెలుసా!

Goal Secrecy

Goal Secrecy

Goal Secrecy: ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది తమ జీవితాన్ని సోషల్ మీడియా వేదికగా పంచేసుకుంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయాన్ని వాట్సాప్ స్టేటస్, రీల్స్ రూపంలో ప్రపంచానికి చాటిచెబుతున్నారు. అయితే ఈ తరహా అలవాటు వ్యక్తిగత ఎదుగుదలకు తీవ్ర ఆటంకంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంతోషాన్ని పంచుకోవడం మంచిదే అయినప్పటికీ, దినచర్యను సైతం బహిర్గతం చేయడం వల్ల నెగటివ్ వైబ్రేషన్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించేటప్పుడు లేదా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాని గురించి ముందే అందరికీ చెప్పేయడం వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. పని పూర్తి కాకముందే ప్రచారం చేసుకోవడం వల్ల అంచనాలు పెరిగిపోయి, అనుకున్న ఫలితాలు రావు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో సైతం ఇదే విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఒక వ్యక్తి తన ప్రణాళికలు, ఆలోచనలు, సమయాన్ని అత్యంత రహస్యంగా ఉంచినప్పుడే విజయం తలుపు తడుతుంది.

చేసే పనిలో ఆటంకాలు ఎదురుకాకుండా ముందుకు సాగాలంటే కాస్త గోప్యత పాటించడం అనివార్యం. జీవితంలో గెలుపొందడం ముఖ్యమే కానీ, ప్రతి చిన్న విషయానికి స్టేటస్ పెట్టడం కాదని గ్రహించాలి. విజయం సాధించిన తర్వాత వచ్చే ఫలితమే ప్రపంచానికి మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అనవసరమైన హడావుడి తగ్గించి, లక్ష్యం నెరవేరే వరకు మీ ఆలోచనలను రహస్యంగా ఉంచడమే ఉత్తమం.