పోలీసులంటే లెక్కలేదా? నడివీధిలో వరుస హత్యలు.. బిక్కుబిక్కుమంటున్న నగరవాసులు

Hyderabad Murders

Hyderabad Murders

Hyderabad Murders: పోలీసులంటే భయం లేకుండా పోతుందా? కేసులు, జైళ్లన్నా భయం లేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు నగరవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొన్న మీర్‌పేట్‌లో, నేడు నాగోల్‌లో వరుసగా జరుగుతున్న దారుణాలు రౌడీ మూకలు పేట్రేగిపోతున్న తీరుకు అద్దం పడుతున్నాయి. చట్టాలు, పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా నేరస్థులు యథేచ్ఛగా వీధుల్లోకి వచ్చి హత్యలకు తెగబడుతుంటే లాఠీలు మౌనంగా ఉంటున్నాయా అనే విమర్శలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా నగర బహిష్కరణలు, కఠినమైన బైండోవర్ కేసులు ఎక్కడికి పోయాయని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారు.

పాత కక్షలు, ఆర్థిక వివాదాలు మళ్లీ నగరంలో నెత్తుటి ఏరులు పారిస్తున్నాయి. పగలతో రగిలిపోతున్న రౌడీషీటర్లు బహిరంగంగా కత్తులతో దాడులు చేస్తూ నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణంగా దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నయీమ్ ప్రస్తుతం బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నాడు. నయీమ్, మరో రౌడీషీటర్ ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ బాల్య స్నేహితులు. ఇద్దరూ కలిసి చదువుకోవడమే కాకుండా నేర ప్రపంచంలోనూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. వీరిద్దరిపై గతంలో పలు హత్య కేసులు నమోదు కావడం వల్ల ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు కూడా తెరిచారు.

అయితే, ఇటీవల సెటిల్మెంట్లు చేసిన డబ్బుల పంపిణీ విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు, ముఠా కక్షలు చెలరేగాయి. ఈ పాత కక్షలను మనసులో ఉంచుకున్న మహేష్, నయీమ్‌ను వదిలించుకోవాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో నయీమ్‌ను అడ్డుకున్న మహేష్ తన అనుచరులతో కలసి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నయీమ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహేష్ ముఠా సభ్యుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించి గాలిస్తున్నారు.

రౌడీలు స్వేచ్ఛగా హత్యలు చేసుకుంటూ పోతుంటే, సాధారణ పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. కేసులు, జైళ్లు అత్తారింటికి వెళ్లినంత ఈజీగా మారిపోవడంతో హంతకులకు చట్టం అంటే భయం లేకుండా పోతోందని సామాన్యులు వాపోతున్నారు. ఇలా యథేచ్ఛగా వీధుల్లో హత్యలు చేసుకుంటూ పోతే తమకు రక్షణ ఏదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శాంతిభద్రతల సమస్య మరింత క్షీణించకముందే మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు లాఠీ ఝుళిపించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రౌడీ మూకల ఆటకట్టించి, ప్రజలకు పూర్వపు ప్రశాంత వాతావరణాన్ని, రక్షణను పునరుద్ధరించాలని నగరవాసులు కోరుతున్నారు.