PINCODE: పిన్ కోడ్‌కు ఇక సెలవు!

అందుబాటులోకి భారత్ పోస్ట్ ‘డిజిపిన్’!
అడ్రస్ కోసం వెతకాల్సిన పనిలేకుండా 10 అంకెల డిజిటల్ కోడ్
ఐఐటీ హైదరాబాద్, ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్సీ సహకారంతో రూపకల్పన

మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 05): దశాబ్దాల చరిత్ర కలిగిన సాంప్రదాయ ‘పిన్ కోడ్’ (PIN Code) వ్యవస్థ స్థానంలో అత్యాధునిక డిజిటల్ విప్లవానికి తెరలేచింది. సమాచారాన్ని, పార్సిళ్లను మరింత కచ్చితత్వంతో చేరవేసేందుకు భారత తపాలా శాఖ ‘డిజిపిన్’ (DigiPIN) పేరుతో కొత్త జియోకోడెడ్ డిజిటల్ అడ్రస్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఏంటి ఈ ‘డిజిపిన్’? పిన్ కోడ్‌కు, దీనికి తేడా ఏంటి?
ప్రస్తుతం వాడుతున్న 6 అంకెల పిన్ కోడ్ ఒక నిర్దిష్టమైన పెద్ద ప్రాంతాన్ని లేదా పోస్టల్ పరిధిని మాత్రమే సూచిస్తుంది. కానీ కొత్తగా తీసుకొచ్చిన 10 అంకెల ‘డిజిపిన్’ మీ ఇల్లు, వ్యాపార సంస్థ లేదా ఆఫీసు ఉన్న సరిగ్గా 4 మీటర్ల చుట్టుకొలత (Exact Geo-Location) లోకేషన్‌ను కచ్చితంగా గుర్తిస్తుంది. ఐఐటీ హైదరాబాద్, ఇస్రో (ISRO), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సహకారంతో తపాలా శాఖ ఈ అత్యంత సురక్షితమైన నేవిగేషన్ వ్యవస్థను రూపొందించింది.

ఉపయోగాలు ఇవే:

ఈ-కామర్స్ & పార్సెళ్లు: ఆన్‌లైన్ షాపింగ్ డెలివరీలు చిరునామా తెలియక ఆలస్యం కాకుండా, తప్పుడు చిరునామాలకు వెళ్లకుండా నేరుగా మీ ఇంటి ముంగిటికే చేరుతాయి.
ఎమర్జెన్సీ సేవలు: అంబులెన్స్, ఫైర్ ఇంజన్ లేదా అత్యవసర సేవలు గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా ఎలాంటి శ్రమ లేకుండా వేగంగా చేరుకోగలవు.
ఆఫ్‌లైన్ సేవలు: డిజిపిన్ వ్యవస్థ ఇంటర్నెట్ లేని సమయంలో ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా సాంకేతికతను జోడించారు.

మీ ‘డిజిపిన్’ ఎలా తెలుసుకోవాలి?
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన dac.indiapost.gov.in/mydigipin/home వెబ్‌సైట్‌ను సందర్శించి, మ్యాప్‌లో మీ ఇంటి లేదా లొకేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా మీ 10 అంకెల డిజిపిన్ నంబర్‌ను సులభంగా పొందవచ్చు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇదే ప్రధాన అధికారిక చిరునామాగా మారనుంది.