నిత్యం పారుతున్న మురుగు నీళ్లలో కొట్టుకుపోతున్నాయా
నడిరోడ్డుపై పొంగిపొర్లే మురుగులోనే విద్యార్థుల ప్రయాణాలా
అభం శుభం తెలియని చిన్నారుల భద్రతపై కనీసం పట్టింపు లేదా
ప్రమాదకరంగా ‘నవారు యాదిరెడ్డి కాలనీ’ టర్నింగ్.. సరిగ్గా మలుపు వద్దే మ్యాన్‌హోల్
బడంగ్ పేట్ మున్సిపాలిటీలో అరకొర పనులు, ప్లానింగ్ లేని నమూనాతో రోడ్లు ధ్వంసం
మినిట్ 2 మినిట్, బడంగ్ పేట్(ఆగస్ట్ 12): పన్నుల రూపంలో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా.. నగరవాసులకు మిగిలేది కన్నీళ్లేనా? పారే డ్రైనేజీ ప్రవాహాల్లోనే ప్రజాధనం కొట్టుకుపోతోందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. పేరుకే ‘విశ్వనగరం’ కానీ, తీరు మాత్రం ‘ఊరు దిబ్బ’ చందంగా ఉంది! ఫ్లెక్సీల్లో నవ్వుతూ కనిపించే నాయకులకు, నేలపై పరుగులు పెడుతున్న డ్రైనేజీ ప్రవాహం కానరాకపోవడం నిజంగా విచిత్రమే. ఇది బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్‌గూడాలోని వినాయకనగర్ హిల్స్ నుంచి శ్రీశ్రీ హోమ్స్ వరకు ఉన్న రహదారుల దుస్థితి!
ఈ ప్రాంతంలో రెండు ప్రముఖ పాఠశాలలు ఉన్నాయి. ముఖ్యంగా త్రివేణి స్కూల్ ఎదురుగా నిత్యం మురుగునీరు పొంగిపొర్లుతూనే ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే పారుతున్న మురుగునీటికి తోడు వర్షాలు పడితే పరిస్థితి మరింత భయానకంగా మారనుందని తెలిపారు. ఈ దుర్గంధం మధ్యే విద్యార్థులు బడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు ‘మొద్దునిద్ర’ వీడకపోవడం శోచనీయం. ‘‘పన్నులు కట్టించుకోవడంలో ఉన్న శ్రద్ధ.. మా పిల్లల ఆరోగ్యాలు, భద్రతపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎందుకు లేదు?’’ అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాదకరంగా ‘నవారు యాదిరెడ్డి కాలనీ’ టర్నింగ్!
అల్మాస్‌గూడా పరిధిలోని నవారు యాదిరెడ్డి కాలనీ మలుపు దగ్గర ఉన్న మ్యాన్‌హోల్ వాహనదారులకు, బాటసారులకు ప్రమాదకరంగా మారింది. సరిగ్గా టర్నింగ్ పాయింట్‌లోనే తెరిచి ఉన్నట్లుండే ఈ మ్యాన్‌హోల్ బెంబేలెత్తిస్తుంది. వాహనదారులు కాస్త అప్రమత్తతో ఉన్నా ప్రమాదంలో పడటం ఖాయం. సమస్య తీవ్రమైనప్పుడు ఏదో పేరుకు వచ్చి చూసి వెళ్లడం తప్ప, శాశ్వత పరిష్కారం చూపడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
పదే పదే డ్రైనేజీలు ఎందుకు పొంగిపొర్లుతున్నాయి?
ప్రజాధనం కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెప్తున్నా.. రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి సదా ‘షరామామూలే’ అన్నట్లుగా ఎందుకుంటోంది? ఈ దుస్థితి వెనుక ఉన్న అసలు కారణాలు నాణ్యత లేని పనులు, భవిష్యత్ అవసరాలను విస్మరించడం, అధికారుల్లో నిర్లక్ష్యం. శాశ్వత ప్లానింగ్ లేకుండా అరకొర పనులు చేస్తున్నారు. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా పైప్‌లైన్ల సామర్థ్యాన్ని పెంచడం లేదు. కాంట్రాక్టర్ల పనితీరుపై కనీస తనిఖీలు లేకుండా పోతున్నాయి.
శాశ్వత పరిష్కారం కావాలి!
ప్రజల ఓట్లతో గెలిచి, పన్నుల డబ్బుతో జీతాలు పొందుతున్న నాయకులు, అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? లేక ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తారా? అంటూ పౌరసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బడంగ్‌పేట్ మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే క్షేత్రస్థాయికి వచ్చి ఈ మురుగు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాయి. మ్యాన్‌హోల్ నిర్మాణ పనులను శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేసి, రోడ్లపై పారే మురుగునీటికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నాయి.
