TELANGANA: ప్రభుత్వ బడుల బలోపేతమే ధ్యేయం!

మినిట్ 2 మినిట్, ఇబ్రహీంపట్నం (ఆగస్ట్ 14):ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలవడమే తమ ప్రాథమిక లక్ష్యమని కప్పపహాడ్ గ్రామ సర్పంచ్ బింగీ గీతా రాములయ్య స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్కూల్ యూనిఫామ్‌లు, షూస్‌ను పాఠశాల హెచ్‌ఎమ్ ఆనందు సమక్షంలో సర్పంచ్ గురువారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం గ్రామ యువత భాగస్వామ్యంతో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులందరికీ తన సొంత ఖర్చులతో స్టూడెంట్ ఐడీ కార్డులు, టైలు, బెల్టులను కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ పాఠశాలలో చదివి స్థిరపడినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులు బడిని దత్తత తీసుకుని అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పలపు రమేష్, వార్డు సభ్యులు జంగలి శంకర్, అరుగే అలివేలు, శ్రీశైలం, ఉపాధ్యాయులు కల్పన, పారిజాత, తిరుపతయ్య, బేగం తదితరులు పాల్గొన్నారు.