గంటల కొద్దీ నిరీక్షణ.. పట్టుమని పది సెకన్లు కూడా దక్కని దర్శనం
క్యూలైన్లలో ఉక్కపోత.. పనిచేయని ఫ్యాన్లు, స్పందించని హెల్ప్ డెస్క్ నంబర్లు!
వీవీఐపీలకు, డబ్బున్నోళ్లకేమో నిమిషాల వ్యవధిలోనే తెరుచుకునే ద్వారాలు
ఇదేం తీరు శ్రీనివాసా.. దూరభారాలను లెక్కచేయని సామాన్యులు పట్టరా?
మినిట్ 2 మినిట్, తిరుమల (ఆగస్ట్ 07): కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, గోవింద నామాన్ని స్మరించుకోవాలని సుదూర నుంచి వచ్చే సామాన్య భక్తుడికి తిరుమల కొండపై చుక్కలు కనపడుతున్నాయి. గంటల కొద్దీ కంపార్ట్మెంట్లలో, క్యూలైన్లలో నలిగిపోతూ, కనీస సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న వెతలు వర్ణనాతీతంగా మారాయి. స్వామివారి దర్శన వ్యవస్థలో సరైన ప్రణాళిక లోపించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు వారాల క్రితం స్వామి వారి దర్శనానికి వెళ్లినప్పుడు మినిట్ 2 మినిట్ ప్రతినిధులకు ఎదురైన అనుభవాలకు అక్షర రూపం ఈ కథనం.
20 నుంచి 30 గంటల నిరీక్షణ..!
క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో భక్తులను 20 నుంచి 30 గంటల పాటు నిలబెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అక్కడ నెలకొంది. క్యూ లైన్లలో అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేశామని చెప్పే ‘హెల్ప్ డెస్క్’ నంబర్లు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఫోన్ చేస్తే స్పందించే వారే లేరు. గంటల కొద్దీ నిరీక్షిస్తూ, దూర ప్రాంతాల నుంచి చిన్న పిల్లలు, వయోవృద్ధులతో వచ్చే భక్తులు అల్లాడిపోయారు. వారి ఆవేదనను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
వీఐపీలకే ప్రాధాన్యతా? సామాన్యుడికి 10 సెకన్ల అదృష్టం కూడా లేదా?
వీవీఐపీలకు, రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉన్నవారికి నిమిషాల్లో సునాయాస దర్శనాలు కల్పిస్తున్న యంత్రాంగానికి, గంటల తరబడి నిరీక్షించే సామాన్యుడి కష్టం ఎందుకు కనిపించడం లేదు? రోజంతా నలిగిపోయి, చెమటలు కార్చుకుంటూ లోపలికి వెళ్తే.. ఆ శ్రీనివాసుడిని కళ్లారా చూసుకునే భాగ్యం కనీసం 10 సెకన్లు కూడా ఉండడం లేదు. “అంత కష్టపడి మెట్లెక్కి, కొండకు వచ్చి స్వామిని కనీసం ఒక నిమిషం చూడలేనప్పుడు ఈ యాత్ర ఎందుకు? ఇలాగే కొనసాగితే భక్తులు స్వామివారి ఏడుకొండలకు దండం పెట్టుకుని అటు నుంచి అటే వెనక్కి వెళ్లే రోజులు వస్తాయి” అని ఒక సామాన్య భక్తుడు తీవ్ర ఆవేదనతో మినిట్ 2 మినిట్ ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, క్యూలైన్ల దగ్గర అపరిశుభ్రవాతావరణం కనిపించింది. కోట్ల రూపాయల నిధులు ఉన్న స్వామి వారి కొండపై 24/7 క్లీనింగ్ చేసే ప్రాసెస్ ఎందుకు లేదన్న ప్రశ్న భక్తుల నుంచి ఎదురైంది. బాత్రూమ్స్ కూడా కొన్ని చోట్ల అపరిశుభ్రంగా ఉండడం కనిపించిందని సదరు భక్తులు మినిట్ 2 మినిట్తో తెలిపారు.
దేవదేవుడిని దూరం చేసి.. పాపం మూటగట్టుకోకండి!
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి ఇది నిజమైన అగ్నిపరీక్ష. ‘స్వామివారి సన్నిధిలో అందరూ సమానులే’ అనే దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికి, సామాన్య భక్తుడికి రెడ్ కార్పెట్ పరవాలి. గంటల కొద్దీ నిరీక్షణలు, అరకొర వసతులకు స్వస్తి పలికి, సామాన్యుడికి శ్రీవారి నిజరూప దర్శనం ఎప్పుడు సులభతరం అవుతుందో నాడే టీటీడీ యాజమాన్యం విజయం సాధించినట్లు! లేదంటే తిరుపతికి వచ్చి, ఏడుకొండలను చూసుకుని వెళ్లిపోయే పరిస్థితి ఎంతో దూరంలో లేదనే మాట అక్షర సత్యం అవుతుంది. భక్తజనుల ఆక్రందనలను పట్టించుకోకపోతే, కలియుగ దైవం వేంకటేశ్వరుడి అగ్రహంతో పాటు సామాన్యుడి శాపమూ తప్పదు!
