Bhoobharati Scheme: గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చిన తండ్రీకొడుకుల అభద్రతకు, భూ వివాదాలకు ‘భూభారతి’ ద్వారా స్వస్తి పలికేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
వనపర్తి కలెక్టరేట్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూభారతి ద్వారా ప్రవేశపెడుతున్న సమగ్ర భూ సర్వే ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు చరమగీతం పడనుందని స్పష్టం చేశారు. ఇందుకోసం 5,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అత్యాధునిక సర్వే పరికరాలు, రోవర్ల సహాయంతో పక్కా కొలతలు వేయించనున్నట్లు తెలిపారు. సర్వే పూర్తయ్యాక భూమి విస్తీర్ణం, సరిహద్దులతో కూడిన పక్కా రక్షణగా ‘భూ ఆధార్’ కార్డులను జారీ చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో పూరిగుడిసెలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
