‘రణబాలి’ ఆవిష్కరణ.. మన సంపదను మింగిన తెల్లదొరల రాక్షస పాలన

British exploitation

British exploitation

British exploitation: చరిత్రకు ఎప్పుడూ రెండు కోణాలు ఉంటాయి. ఒకటి మనం పాఠ్యపుస్తకాల్లో చదివిన అబద్ధపు జిలుగుబిలుగులైతే, రెండోది కాలగర్భంలో సమాధి చేయబడిన భయంకరమైన చేదు నిజం. “బ్రిటీషర్లు భారతదేశానికి రైల్వేలు వేసి నాగరికతను నేర్పారు” అని దశాబ్దాలుగా నమ్మిస్తున్న మాటల వెనుక, మన భూమిని గుల్ల చేసిన ఘోరమైన దోపిడీ కుట్ర దాగి ఉంది. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం ద్వారా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ మరుగున పడిన చారిత్రక సత్యాలను “నెవర్ ఫర్గెట్ – ది ట్రూత్ సిరీస్” పేరుతో 4 భాగాల ప్రత్యేక దృశ్య కావ్యంగా వెలికితీస్తున్నారు.

1876 నుంచి 1878 మధ్య కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో సంభవించిన ఘోరమైన “డొక్కల కరువు” వెనుక ఉన్నది ప్రకృతి వైపరీత్యం కాదు, బ్రిటీష్ పాలకుల కృత్రిమ నరమేధం. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే కోటి మందికి పైగా నిరపరాధ భారతీయులు ఆకలితో అల్లాడి, ఎముకల గూళ్లుగా మారి ప్రాణాలు కోల్పోయారు. మన ప్రజలు కూడు లేక మృత్యువాత పడుతుంటే, నాటి బ్రిటీష్ పాలకులు లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలను తమ దేశానికి, తమ యుద్ధ అవసరాలకు ఓడల్లో తరలించారు. అణచివేతకు గురైన ఈ దారుణాన్ని రణబాలి బృందం బళ్లారి, ఇతర పాత గ్రంథాలయాలు, ఆర్కియాలజీ రికార్డులను శోధించి మరీ కళ్లకట్టేలా దృశ్యరూపంలోకి తెచ్చింది.

బ్రిటీషర్లు నిర్మించిన రైలు మార్గాలు మన ప్రయాణ సౌకర్యం కోసం వేసినవి కావు. భారతీయ నేలల్లోని పత్తి, బంగారం, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాన్ని వేగంగా ఓడరేవులకు చేర్చి బ్రిటన్‌కు రవాణా చేయడానికే ఆ ఇనుప దారులను పరిచారు. మరింత దారుణమైన విషయమేమిటంటే — మన దేశ సంపదను పగటిపూట దోచుకోవడానికి వాడిన ఆ రైల్వేలను, మన ప్రజల పన్నుల డబ్బుతో, భారతీయుల రక్తం-చెమటతోనే నిర్మించారు. ట్రిలియన్ల డాలర్ల సంపదను కబళించిన ఈ రాక్షస దోపిడీ కోణాన్ని చరిత్ర పుస్తకాల్లో తెలివిగా కప్పిపుచ్చారు.

ఈ నాలుగు భాగాల ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా ‘రణబాలి’ చిత్రం కేవలం ఒక సినిమాగా కాకుండా, నాటి బ్రిటీష్ దౌర్జన్యాలను, వారి దోపిడీ విధానాలను ఎండగట్టే ఒక చారిత్రక సాక్ష్యంగా నిలవనుంది. నాటి తెల్లదొరల అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన మన విస్మృత వీరుల త్యాగాలను, వారు చిందించిన నెత్తుటి చుక్కల నిజమైన విలువను ప్రతీ ఒక్కరికీ గుర్తుచేస్తూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రాన్ని ఆసక్తికరమైన దృశ్య కావ్యంగా మలుస్తున్నారు.