Dont Trouble: మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్లో, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో రూపుదిద్దుకున్న ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ వర్గాల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.
రాజమౌళి ఎమోషనల్.. సినిమా చూసి కంటతడి పెట్టా!
ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూడేళ్ల క్రితం దర్శకుడు శశాంక్ వచ్చి ఒక దయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి అనే డిఫరెంట్ పాయింట్ చెప్పినప్పుడే సినిమాపై తనకు నమ్మకం కుదిరిందని ఆయన తెలిపారు. పూర్తి కథ విన్న తర్వాత తాను ఎమోషనల్ అయ్యానని, సినిమా చూసి కంటతడి పెట్టానని రాజమౌళి చెప్పారు. ఈ చిత్రం పక్కాగా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే నటుడిగా ఫహాద్ ఫాజిల్ ప్రతిభను, నిర్మాతగా తన కుమారుడు కార్తికేయ పడుతున్న కష్టాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
ఫహాద్ ఫాజిల్ దేశం గర్వించదగ్గ నటుడు: ఎన్టీఆర్
ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తనకు అత్యంత ఇష్టమైన నటుల్లో ఫహాద్ ఫాజిల్ ఒకరని, ఆయన దేశం గర్వించదగ్గ గొప్ప నటుడని కొనియాడారు. తెలుగులో ఫహాద్ చేస్తున్న తొలి పూర్తి స్థాయి చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఇక తన తమ్ముడు కార్తికేయ నిర్మాతగా తన తొలి అడుగు వేయడం చాలా గర్వంగా ఉందని, ఈ సినిమాతో ఆయన మరింత ఎత్తుకు ఎదుగుతాడని ఆకాంక్షించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చారిత్రాత్మక విజయాల వెనుక కార్తికేయ కృషి ఎంతో ఉందని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు.
సరికొత్త ఫాంటసీ ప్రపంచంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్
నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ.. తారక్ అన్న ఎలాంటి ఆర్భాటం లేకుండా, తమ్ముడి సినిమా కోసం స్వయంగా వచ్చి సపోర్ట్ చేయడం తన జీవితంలో మరువలేని క్షణమన్నారు. సినిమా కోసం హైదరాబాద్‌లోని దాదాపు 75 రియల్ లొకేషన్లలో ఎంతో కష్టపడి షూటింగ్ చేశామని తెలిపారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా, ఒక మంచి భావోద్వేగాలతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని వెల్లడించారు. ఈ చిత్రానికి కాలభైరవ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలవనుంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
