Chandrasekhar Reddy: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ మామ కె. చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు నమోదైంది. నానక్‌రామ్‌గూడలోని మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి, సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి టిన్‌షీట్లు ఏర్పాటు చేశారంటూ మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పెద్దిరాజు పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాదంలో కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరుల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.
నానక్‌రామ్‌గూడ సర్వే నంబర్ 130 లో ఉన్న మంత్రీ కాస్మోస్ భవనం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) పరిధిలోకి వస్తుందని, అక్కడ బహుళజాతి సాఫ్ట్వేర్ సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఉదయం సౌత్‌వెస్ట్ కార్నర్ గేట్ తాళాలు పగులగొట్టి, భద్రతా సిబ్బందిని బెదిరించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఈ చర్య వల్ల ఫైర్ ఎమర్జెన్సీ మార్గానికి, ఐటీ సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను, ఆధారాలను పెన్‌డ్రైవ్‌లో పోలీసులకు అందజేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, భవనానికి భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ, సైబరాబాద్ సిపి సహా ఇతర ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు ప్రతులను పంపారు.
