Kolanu Bharati: శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయమైన కొలను భారతి ఆలయ అభివృద్ధిపై ఈ రోజు ( 12.09.2026) కొలనుభారతీక్షేత్రంలో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబడింది.
ఈ సమీక్షా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు ఆలయ అభివృద్ధికి వనరులు, ఆలయానికి రాబడి, అభివృద్ధికి దాతల సహకారం, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాలపై మాట్లాడారు. ఇంకా వారు మాట్లాడుతూ నల్లమల అడవుల్లో పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలదేవస్థానం కొలనుభారతీ ఆలయాన్ని దత్తత తీసుకోవడంతోనే ఆలయానికి మహర్దశ పట్టిందని అన్నారు. ఈ క్షేత్రంలో కైంకర్యాలను సక్రమంగా సజావుగా జరిగేలా అందరూ చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులతో కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని దేవస్థానం అధికారులకు సూచించారు.
అటవీ మార్గంలో ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో రాకపోకలు, విద్యుద్దీకరణకు సహకరించాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. సరస్వతీ అమ్మవారి ఆలయంలో వేదపండితులతో కైంకర్యాలను జరిపించడం తన చిరకాల వాంఛ అన్నారు. నిత్యం దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను నమోదు చేస్తామని, ఈ ఆలయం అందరిది అని, ఆలయ అభివృద్ధికి అందరు కృషి చేయాలని కోరారు.
భవిష్యత్తులో దశలవారీగా ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తామన్నారు.
ఇకమీదట తరుచుగా ఆలయ అభివృద్ధిపై సమీక్షా సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఆలయం వద్ద వేదపండితులకు, అర్చకస్వాములకు శాశ్వతంగా రెండు గదులు నిర్మించడానికి తగు చర్యలు చేపట్టుతామన్నారు.
కాగా శ్రీశైలదేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ యం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయంలో సమయపాలన చాలా ముఖ్యమని అన్నారు. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు ఆలయశుద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ఆయా సమాయాలలో పరిపూర్ణంగా ఆలయసేవలను జరపాలని సిబ్బందిని ఆదేశించారు. ఆలయంలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు. ఆర్జితసేవలకు మాత్రం నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నట్లుగా చెప్పారు.
భక్తులకు రక్షితత్రాగునీరు కోసం ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామనీ, అక్షరాభ్యాసం చేయు మండపాన్ని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి విద్యుద్దీకరణ మెరుగుపరుస్తామన్నారు. సిబ్బందికి గుర్తింపు కార్డులను అందజేస్తామన్నారు. సిబ్బంది విధుల నిర్వహణ సమయంలో సంప్రదాయవస్త్రాలతో ఉండాలన్నారు. ప్రతీరోజు ఉద్యోగుల హాజరును పర్యవేక్షణ చేస్తామని, వారంలో రెండు రోజులు దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి వారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. క్షేత్రానికి విచ్చేసే ప్రముఖుల అభిప్రాయాలను రిజిస్టరు నందు నమోదు చేయించి, వారి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు.
భక్తులు సమర్పించే కానుకలను క్రమం తప్పకుండా ఆలయ ఖాతాలో జమ చేయడం జరుగుతోందన్నారు. అసంపూర్ణంగా మిలిగిన ఆలయ మండప పనులను సిజిఎఫ్ నిధులతో పూర్తి చేస్తామని తెలిపారు. శివపురం గ్రామం సమీపంలో ముఖద్వారం నిర్మించడానికి చర్యలు చేపట్టుతామన్నారు. అమ్మవారి ఆలయంలో శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనుబంధ ఆలయాలలో కూడా శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శాశ్వత శౌచాలయాలు, ఓవర్‌హెడ్ ట్యాంకు, మంచినీటిసరఫరా కోసం బోర్‌బావి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రమంతటా అమ్మవారి దివ్యనామం వినిపించే విధంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఉత్సవాల సమయంలో అవసరం మేరకు అత్యున్నత నాణ్యతతో కూడిన సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటన్నింటిని ధర్మకర్తల మండలి సమావేశంలో అజెండా అంశాలుగా ప్రవేశపెట్టి కూలంకుషంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఆలయం ఖాతాలో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లు, మిగిలిన నిలువ ధనం అలాగే ఉందనీ, ఇక్కడి ఉద్యోగులకు జీతాలు కూడా శ్రీశైలదేవస్థానమే చెల్లిస్తుందన్నారు.
సమావేశంలో కాకనూరు స్వామి శ్రీశ్రీశ్రీ శివ యోగేంద్ర సరస్వతీ స్వామివారు మాట్లాడుతూ కొలనుభారతి విశిష్ట క్షేత్రమని, ఇక్కడ సప్తఋషులు తపస్సు చేశారని పేర్కొన్నారు. ఇక్కడ శ్రీశ్రీశ్రీ సరస్వతీనారాయణ స్వాములవారు ఎంతో సేవ చేశారన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, అందరూ అమ్మ సేవకులేననీ తెలిపారు. అమ్మవారి సేవాభాగ్యం అందడం జన్మ జన్మల పుణ్యం అని అన్నారు. ఈ ఆలయంలో సమయపాలన ఉండాలన్నారు. తాత్కాలిక ఏర్పాటు కాకుండా, శాశ్వత ప్రతిపాదికన భక్తులకు సౌకర్యాలు ఉండాలన్నారు. ఆలయానికి కుంభాభిషేకం జరగాలనీ, వైదికధర్మంగా కైంకర్యాలను జరిపించాలని కోరారు.
దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు డా. చిట్టిబొట్ల భరద్వాజశర్మ, మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పాటుపడతామనీ, దత్తత తీసుకున్న కొద్ది సమయంలో వచ్చిన వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. శివపురం గ్రామప్రజలందరూ కలిసి దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలన్నారు. యజ్ఞాలు – యాగాలు జరిగే చోట ఎటువంటి దీర్ఘకాలిక రోగాలూ ఉండవన్నారు. దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, శ్రీ మేడా మురళీధర్ మాట్లాడుతూ అవకాశం మేరకు ఆలయానికి ప్రతీరోజు భక్తులు పెద్దసంఖ్యలో సందర్శించాలన్నారు. ఆలయవిశిష్టతను అందరికీ తెలియజేయాలని చెప్పారు. అనంతరం ఫారెస్ట్ అధికారి శ్రీ స్వరూప్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల సూచనలను అనుసరించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సమావేశంలో పలువురు దేవస్థానం అధికారులు, స్థానిక ప్రభుత్వ స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.