TELANGANA: బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా.. ముఠా గుట్టురట్టు !

బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల అక్రమ దందా.. ముఠా గుట్టురట్టు!

టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ వాయిల్స్ స్వాధీనం

యూపీ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి నగరంలో అధిక ధరలకు విక్రయం

స్టెరాయిడ్లు, నిషేధిత ఇంజెక్షన్లతో యువత ప్రాణాలకే ప్రమాదం

మినిట్ 2 మినిట్, క్రైమ్ బ్యూరో (ఆగస్ట్ 22): నగరంలో బాడీ బిల్డింగ్, కండరాల పెంపు పేరిట ప్రమాదకరమైన మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఇద్దరు సప్లయర్లు, ఇద్దరు వినియోగదారులు సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ వాయిల్స్‌తో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఈ ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, షాడోఫ్యాక్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో వాయల్‌ను కేవలం రూ.160కి కొనుగోలు చేసి, జిమ్‌లకు వచ్చే అమాయక యువకులకు దాదాపు రూ.900 వరకు విక్రయిస్తున్నట్లు తేలింది. గోషామహల్ పరిధిలోని ఎంజే బ్రిడ్జి, భోలక్ష్మి మాత ఆలయం సమీపంలో కస్టమర్లకు ఇంజెక్షన్లు సరఫరా చేస్తుండగా పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
సులభంగా, వేగంగా కండలు పెంచాలనే పిచ్చితో చాలామంది యువకులు ఈ తరహా నిషేధిత స్టెరాయిడ్లు, హార్మోన్ ఇంజెక్షన్ల వలలో పడుతున్నారు. వైద్యుల సలహా లేకుండా మెఫెంటర్‌మైన్ సల్ఫేట్ వంటి డ్రగ్స్‌ను తీసుకోవడం వల్ల రక్తపోటు విపరీతంగా పెరగడం, గుండెపోటు (హార్ట్ అటాక్), కిడ్నీలు మరియు లివర్ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉం‌టుంది. అంతేకాకుండా మానసిక ఆందోళన, నపుంసకత్వం మరియు అకాల మరణాలకు ఇవి దారితీస్తాయి. క్షణికానందం, బాహ్య సౌందర్యం కోసం చేసే ఇలాంటి ప్రాణాంతక ప్రయోగాలు యువత బంగారు భవిష్యత్తును, వారి కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఈ అక్రమ దందా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.