కొలంబియాలో ఘోర ప్రమాదం..
బంగారు గని కుప్పకూలి 13 మంది మృతి!
మరొక ఏడుగురికి తీవ్ర గాయాలు..
ఆర్మ్‌డ్ గ్రూప్స్, డ్రగ్ కార్టెల్స్ అక్రమ తవ్వకాల వల్లే పదేపదే ప్రమాదాలు
మినిట్ 2 మినిట్, అంతర్జాతీయ బ్యూరో (ఆగస్ట్ 22 ): దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర గని ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో జరిగిన బంగారు గని ప్రమాదాన్ని మరచిపోకముందే, కొలంబియాలోని ఓ అక్రమ ఓపెన్ పిట్ బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలింది. నారీణో డిపార్ట్‌మెంట్ పరిధిలోని పోలికార్పా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ గనిలో బుధవారం రాత్రి భారీగా కొండచరియలు విరిగిపడటంతో అక్కడికక్కడే 13 మంది కార్మికులు మృతి చెందారని స్థానిక అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు.
ఈ ప్రమాదంలో మరొక ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు నారీణో ప్రభుత్వ కార్యదర్శి ఫెడ్రి గేమెజ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు భారీ ఎక్స్‌కవేటర్ల సహాయంతో గురువారం తెల్లవారుజామున 2 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి. ప్రమాదం జరిగిన గని ప్రాంతంలో భూమి కుంగిపోవడం, సురక్షితం కాని పరిస్థితులు ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కాగా, కొలంబియాలో లైసెన్సులు లేని అక్రమ తవ్వకాలు, ఆర్మ్‌డ్ గ్రూప్స్ (సాయుధ ముఠాలు), డ్రగ్ కార్టెల్స్ అక్రమ బంగారు రవాణాకు పాల్పడుతుండటం తీవ్ర సవాలుగా మారింది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా యంత్రాలతో భూమిని తోడేస్తుండటంతో బేస్ బలహీనపడి ఇలాంటి కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే గిరిజన కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో తీవ్ర శోకసంద్రాన్ని నింపింది.
