Allu Sirish: గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ముగిసినప్పటికీ అర్ధరాత్రి వేళల్లో దేవాలయ ప్రాంగణాల్లో లౌడ్ స్పీకర్లు, డిజే మోతలు మోగించడంపై ప్రముఖ నటుడు అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ తన ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించారు. తాను కంప్లైంట్ చేసింది భక్తిపై కాదని, కేవలం పౌర బాధ్యత, సామాజిక స్పృహ లేకపోవడంపైనేనని వెల్లడించారు.
షేక్‌పేట్ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయం వరకు పరిమితికి మించిన శబ్దాలతో పాటలు పెడుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని శిరీష్ పేర్కొన్నారు. తాను స్వయంగా హనుమంతుని భక్తుడనని చెప్పిన ఆయన, అర్ధరాత్రి సమయాల్లో పెద్ద పెట్టున సౌండ్లు పెట్టడాన్ని భక్తిగా భావించలేమని అభిప్రాయపడ్డారు. శబ్దకాలుష్యం కారణంగా విశ్రాంతి తీసుకునే నివాసితులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో ప్రతి ఒక్కరికీ కనీస పౌర స్పృహ (సివిక్ సెన్స్) ఉండాలని, చట్ట నిబంధనలను పాటించాలని శిరీష్ కోరారు. ఉత్సవాలు లేదా వేడుకల సమయంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా పరిమితులకు లోబడి ప్రవర్తిస్తే పోలీసు దాకా వెళ్లాల్సిన అవసరమే ఉండదని సూచించారు. రాత్రివేళల్లో ప్రశాంతతను భంగపరిచే చర్యలను నివారించడమే తన ఫిర్యాదు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
