Dhanush politics: తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్ హీరో రాజకీయ ఆరంగేట్రంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు ధనుష్ తన అభిమాన సంఘాన్ని సంక్షేమ ఉద్యమంగా మారుస్తుండగా, మరోవైపు రాజకీయ పార్టీలు ఆయనను ఆహ్వానిస్తుండటం తమిళనాట ప్రాధాన్యం సంతరించుకుంది.
అభిమాన సంఘం నుంచి సంక్షేమ ఉద్యమం వైపు…
ఇటీవల ధనుష్ తన అభిమాన సంఘాన్ని ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్పు చేయడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. ఇందులో భాగంగా కోయంబత్తూరులో సుమారు 3,000 మంది ప్రతినిధులతో భారీ సమావేశం నిర్వహించారు. ఈ వేదికగా ప్రజా సేవ, సామాజిక బాధ్యత, క్రమశిక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి ధనుష్ స్వయంగా హాజరుకాకపోయినప్పటికీ, ఆయన పేరుతో ఈ తరహా సంస్థాగత మార్పులు జరగడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కూడా తన రాజకీయ ప్రయాణానికి ముందు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారానే అడుగులు వేశారు.
టీవీకే స్పందన & విజయ్ మార్గంపై వ్యాఖ్యలు…
ధనుష్ రాజకీయ ప్రవేశంపై టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్య కుమార్ స్పందిస్తూ సానుకూలంగా స్పందించారు. ధనుష్ రాజకీయాల్లోకి వస్తే తమ పార్టీ తరఫున స్వాగతిస్తామని తెలిపారు. అయితే రాజకీయాల్లో రాణించడం అంత సులభం కాదని హెచ్చరించారు. పార్టీ పెట్టడం ఒక ఎత్తయితే, దానిని విజయవంతంగా నడిపించి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం మరో పెద్ద సవాల్ అని, దీనికోసం పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమ నేత విజయ్ తన సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నటనకు దూరంగా జరిగి, పూర్తిస్థాయి రాజకీయాల కోసం వచ్చారని, ఆ మార్గం ఎంతో కఠినమైనదని ఆయన గుర్తుచేశారు.
అధికారిక ప్రకటన లేకపోయినా జోరుగా చర్చ…
ధనుష్ ఇప్పటివరకు తన రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో అన్నాడీఎంకే సైతం ధనుష్ రాజకీయాల్లోకి వస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం తమిళనాట రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల తర్వాత విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టగా, ఇప్పుడు ధనుష్ కూడా అదే బాటలో పయనిస్తారా లేదా అనేది కోలీవుడ్ వర్గాల్లో మరియు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మునుముందు ధనుష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.
