Vote Note: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ప్రధాన ఫిర్యాదుదారుడిగా, బాధితుడిగా ఉన్న తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఆయన ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. స్టీఫెన్ సన్ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించి, తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ కేసులో స్టీఫెన్ సన్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ కేసు విచారణ వేగవంతమై, ఫిర్యాదుదారుడి వాదనల ఆధారంగా విచారణ ముందుకెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా తీవ్ర సవాలుగా మారే ప్రమాదం ఉంది. న్యాయస్థానంలో కేసు పురోగతి సాధించే కొద్దీ ప్రతిపక్షాలు దీని ఆధారంగా ప్రభుత్వంపై దాడి పెంచేందుకు ప్రయత్నిస్తాయి.
మరోవైపు ఈ పరిణామం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులైన బిఆర్ఎస్, బిజేపిలకు రాజకీయంగా పెద్ద ఎత్తున కలసివచ్చే అంశంగా మారనుంది. గత కొంతకాలంగా మందగించిన ఈ కేసు మళ్లీ తెరపైకి రావడం వల్ల సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు, ఆయనపై నైతిక, రాజ్యాంగపరమైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యర్థులకు ఇది ఒక శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా ఉపయోగపడనుంది.
