Rice Mills: తెలంగాణలో ఎఫ్‌సీఐకి ధాన్యం, బియ్యం సరఫరా చేసే క్రమంలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు తీవ్ర స్థాయిలో రంగంలోకి దిగారు. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ప్రముఖ రైస్ మిల్లులపై విసృతంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల క్రమంలో సుమారు 150 మంది రైస్ మిల్లర్లను అధికారులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని పలు రైస్ మిల్లులపై సీఐడీ అధికారులు పక్కా వ్యూహంతో దాడులు చేశారు.
జమికుంట పట్టణంలోని లక్ష్మీ వెంకటరమణ మిల్లు, లక్ష్మీ సాయి ఇండస్ట్రీస్, రాధాకృష్ణ మిల్లులకు చెందిన వొల్లాల మల్లికార్జున్, యాంపాని సంపత్, లెంటలపల్లి మధులను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని కార్యాలయానికి తరలించారు. ఎఫ్‌సీఐ లేవీ కింద గ్రేడ్-ఏ రకం బియ్యం సరఫరా చేయడంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే అభియోగాలపై ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌లోని మరో మిల్లు యజమానిని సైతం సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
జిల్లాల్లో వరుస అరెస్టులు జరుగుతుండటంతో మిగతా రైస్ మిల్లర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలువురు మిల్లర్లు జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం వైపు పరుగులు తీశారు. మరోవైపు ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగాల్సి ఉన్న సమయంలోనే ఆ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఎన్నికలకు కొద్ది గంటల ముందు అరెస్టులు జరగడం వెనుక అసలు కారణాలపై స్పష్టత ఇవ్వాలని మిల్లర్లు కోరుతున్నారు. సాధారణంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, తొలిసారిగా నేరుగా సీఐడీ అధికారులు విచారణలోకి దిగి దాడులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
