ప్రధాని ఫోటో, నిమ్మకాయలు, మేకులు.. మోడీకి క్షుద్రపూజల వీడియో వైరల్.. రంగంలోకి పోలీసులు!

Modi Ritual

Modi Ritual

Modi Ritual: ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఈ విచిత్ర ఘోర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ప్రధాని ఫోటోను నిలిపి క్షుద్రపూజలు చేసినట్లుగా ఉన్న దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సరయూ నది తీర ప్రాంతంలో ప్రధాని మోడీ చిత్రం చుట్టూ కొబ్బరికాయలు, నిమ్మకాయలు, మేకులు, పసుపు-కుంకుమలతో కూడిన పూజా సామగ్రి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పూజా సామగ్రిని స్వాధీనం చేసుకుని, అమానుషమైన చర్యకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులపై విచారణ ప్రారంభించారు.

మరోవైపు ఈ ఘటనపై రాజకీయం వేడెక్కింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల పనితీరును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విమర్శించడంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సరయూ తీర పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.