ఏసీబీకి చిక్కిన జలమండలి జెడీ.. రాజ్‌భవన్ రోడ్‌లో కారు ఆపి మరీ రూ. 2.40 లక్షల అక్రమ నగదు సీజ్!

ACB Trap

ACB Trap

ACB Trap: ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎమ్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ) జాయింట్ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్ వద్ద లెక్కల్లో లేని భారీ నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సిటీ రేంజ్-2 బృందానికి వచ్చిన రహస్య సమాచారం ఆధారంగా అధికారులు పక్కా వ్యూహంతో నిఘా ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి రాజ్‌భవన్ రోడ్‌లోని మెట్రో రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్ ఎదురుగా వెళ్తున్న కారును ఏసీబీ బృందం ఆకస్మికంగా ఆపి తనిఖీలు చేపట్టింది.

ఆ వాహనం జలమండలి జాయింట్ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్‌కు చెందినదిగా అధికారులు నిర్ధారించారు. ఆఫీసు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో జరిపిన ఈ మెరుపు తనిఖీల్లో ఆయన వద్ద ఉన్న రూ.2.40 లక్షల అక్రమ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నగదుకు సంబంధించిన రశీదులు, ఆధారాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించగా ఆయన సరైన సమాధానం చెప్పలేకపోవడమే కాకుండా పరస్పర విరుద్ధంగా సమాధానాలు ఇచ్చారు. దీంతో అవినీతి కోణంలో విచారణ జరిపేందుకు పంచనామా నిర్వహించి ఆ సొమ్మును అధికారులు సీజ్ చేశారు. ఈ అక్రమ నగదు వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.