Voter List: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నకిలీ, తప్పుడు పత్రాలను సమర్పిస్తే తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఫారం-7 ద్వారా ఓటర్ల పేర్ల తొలగింపునకు నకిలీ డాక్యుమెంట్లు సమర్పిస్తున్నట్లు వార్తలు, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ కావడంపై ఆయన స్పందిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, బహదూర్‌పుర తదితర నియోజకవర్గాల్లో ముందస్తుగా ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను భారీగా సమర్పించి, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా ಪರಿగణించిన సీఈఓ, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు.
ఓటరు నమోదు, సవరణల ప్రక్రియలో ఫారం-6, 6A, 7, 8 ద్వారా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం లేదా నకిలీ డిక్లరేషన్లు ఇచ్చే అభ్యర్థులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫారం-7పై నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు.
