LB NAGAR: బోనమెత్తిన ఎల్బీ నగర్!

అంగరంగ వైభవంగా సంబరాలు
చారిత్రక మాల్ మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
వీధివీధిన నేత్రపర్వతంగా ఘటాల ఊరేగింపు

మినిట్ 2 మినిట్, ఎల్బీనగర్(ఆగస్ట్ 10): హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఎల్బీనగర్‌లోని ప్రసిద్ధ మాల్ మైసమ్మ ఆలయంలో బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనార్థం భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు నిర్వహించారు. స్థానిక మహిళలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నెత్తిపై బోనాలు ఎత్తుకున్న మహిళా భక్తుల అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి, తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు.

నేత్రపర్వంగా ఘటాల ఊరేగింపు
ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఘటం ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. పోతురాజుల విన్యాసాలు, తీన్మార్ దరువులు, కళాకారుల నృత్యాల మధ్య ఘటాన్ని ఊరేగించారు. పోతురాజుల కొరడా దెబ్బలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఎల్బీనగర్ వీధులన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మాల్ మైసమ్మ ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఖల్లా మైసమ్మ, ఇతర ఆలయాలు కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.

పటిష్టమైన పోలీసు బందోబస్తు
ఏలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడమే కాకుండా, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడంతో ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి.