మతం మారితే బీసీ రిజర్వేషన్లు రద్దు.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు!

BC Reservation

BC Reservation

BC Reservation: హిందూ సామాజికవర్గం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులకు వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో గతంలో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్వయం ఈ మేరకు తుది ఆదేశాలు జారీ చేసింది.

వాదనల సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. హిందూ సామాజిక వ్యవస్థ నుంచి మతం మారి ఇతర మతాల్లోకి ప్రవేశించిన ఏ వ్యక్తి కూడా బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ సూత్రం అందరికీ సమానంగా వర్తిస్తుందని పేర్కొంది.

హైకోర్టు తీర్పుకే సుప్రీం జైకొట్టు:

గతంలో తమిళనాడు ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు చెందిన ముస్లింలలో 7 శాఖల వారికి బీసీ గుర్తింపునిస్తూ, జీవోను జారీ చేసింది. అయితే, బీసీల నుంచి ఇస్లాంలోకి మారిన వారిని ‘బీసీ ముస్లింలు’గా పరిగణించడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుబడుతూ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధంగా సరైనదేనని సమర్థిస్తూ, తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సంచలన తీర్పుతో రిజర్వేషన్ల అమలుపై దేశవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది.