hyderabad: ఖాకీల ఆక్రందన!

ఖాకీల ఆక్రందన!

మనోధైర్యం కోల్పోయి, బతుకు భారమై బలవన్మరణాలు
తాజాగా ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీసులో యువ కానిస్టేబుల్ ఆత్మహత్య
విధుల పేరిట టార్చర్.. భరించలేక తనువు చాలించిన వైనం!
బానిసలుగా చూస్తున్న సీనియర్లు.. కన్నీటిపర్యంతమవుతున్న జూనియర్లు

మినిట్ 2 మినిట్, ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్:  అందరినీ కాపు కాచే చేతులే.. మనోధైర్యం కోల్పోయి తమ మెడకు ఉరితాళ్లను వేసుకుంటున్నాయి. సమాజ రక్షణ కోసం రాత్రింబవళ్లు తపించే ఖాకీ చొక్కా వెనుక.. చెప్పలేని మానసిక క్షోభ దాగుందని చెప్పే దారుణ ఘటన ఇది. తాజాగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీపీ కార్యాలయంలో 2024 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్ జె. సాయి కుమార్ (ఈ-కాప్స్ విభాగం) ఆత్మహత్య సర్వత్రా చర్చనీయాంశమైంది. బుధవారం తెల్లవారుజామున కార్యాలయ రెస్ట్ రూమ్‌లో సాయి కుమార్ బలవన్మరణానికి పాల్పడటం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఇది కేవలం ఆత్మహత్య మాత్రమే కాదని, శాఖలోని ‘అధికారిక వేధింపుల ఫలితమే’నని సహచరులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగింది? నిలదీసిన కుటుంబ సభ్యులు!
కర్మన్ ఘాట్‌లో స్నేహితులతో కలిసి నివసిస్తున్న సాయి కుమార్, విధులు ముగించుకోవాల్సిన సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న తోటి సిబ్బంది సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, సాయి మరణం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఒక సీనియర్ రైటర్, మరొక కానిస్టేబుల్ వేధింపులే సాయి ఆత్మహత్యకు ప్రధాన కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినా, ఇతరుల పనిభారాన్ని బలవంతంగా తనపై రుద్దడంతో పాటు సీనియర్ల టార్చర్ భరించలేకే సాయి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు సాగుతున్నాయి.

పోలీసుల్లో పెరిగిపోతున్న నైరాశ్యం.. సీనియర్ల వేధింపులే కారణమా?
పోలీస్ శాఖకు మూలస్తంభం లాంటి కానిస్టేబుళ్లు రోజురోజుకూ మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల డీజీపీ ఆఫీసులో, నేడు ఏసీపీ ఆఫీసులో చోటుచేసుకున్న వరుస ఘటనలు పోలీస్ వ్యవస్థలోని లోపాలను, కిందిస్థాయి సిబ్బంది అనుభవిస్తున్న నరకాన్ని ఎత్తిచూపుతున్నాయి. చాలా పోలీస్ స్టేషన్లలో జూనియర్లను, కిందిస్థాయి కానిస్టేబుళ్లను మనుషులుగా కాకుండా బానిసల్లా చూస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తగినంత సిబ్బంది లేకపోవడం, ఎగువ స్థాయి అధికారుల నుంచి వచ్చే విపరీతమైన టార్గెట్‌ల ఒత్తిడిని జూనియర్లపైకి సీనియర్లు నెట్టేస్తుండడంతో భరించలేకపోతున్నారు. ప్రజాసేవ చేయాలనే ఉత్సాహంతో ఉద్యోగంలో చేరిన యువ కానిస్టేబుళ్లకు అధికారుల, సీనియర్ల బూతులు, హేళనలు నిత్యకృత్యమవుతున్నాయనేది సాయి ఘటనతో మరోసారి బహిర్గతమైంది.

నిత్యం ఒత్తిడి.. కరువైన ‘అభయం’!
శోధించి క్లిష్టమైన నేరస్తులను పట్టుకునే దర్యాప్తు అధికారులు, తమ పక్కనే ఉన్న తోటి ఉద్యోగి అంతరంగంలో దాగిన విషాదాన్ని, మానసిక క్షోభను మాత్రం గుర్తించలేకపోతున్నారు. జీతం, హోదా మాత్రమే మానసిక ప్రశాంతతను ఇవ్వలేవు. రాత్రింబవళ్లు విధుల్లో తపిస్తూ సమాజం కోసం బతికే పోలీసులకు కనీస మానసిక భరోసా లేకుండా పోయింది.

సమాజమా… కాస్త భరోసానివ్వు!
ఏ ఉద్యోగానికి లేని మానసిక, శారీరక ఒత్తిడి పోలీస్ ఉద్యోగంలో ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం అహరహం శ్రమించే ఈ ఖాకీలకు తోటి అధికారుల నుంచి ఆత్మీయత, సమాజం నుంచి గౌరవం, సానుభూతి దక్కాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆత్మహత్యల పరంపర పోలీస్ వ్యవస్థకే కాక, నైతికంగా సమాజానికి తీరని లోటు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సాయి కుమార్ మృతికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, కింది స్థాయి సిబ్బందికి మానసిక ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.