ELECTIONS : ఏపీ, తెలంగాణలో కోటి 10 లక్షల ఓట్ల గల్లంతు !

దశాబ్ద కాలంగా పేరుకుపోయిన నకిలీ, డబుల్ ఓట్లు
SIR ప్రక్షాళనతో బయటపడుతున్న వివరాలు
తాజా లెక్కలతో రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం

మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 13): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన నకిలీ ఓట్లు, డబుల్ ఓట్లు, నివాసాలు మారిన వారి వివరాలు, మరణించిన వారి పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఈ భారీ ఎన్యూమరేషన్ డ్రైవ్‌ను నిర్వహించారు. బూత్ లెవల్ అధికారులు (BLO) ఇంటింటికీ తిరిగి నిర్వహించిన సర్వేలో బయటపడిన గణాంకాల ఆధారంగా రెండు రాష్ట్రాల్లోనూ ఏకంగా కోటి పది లక్షలకు పైగా ఓట్లు తొలిగింపు ప్రతిపాదనల జాబితాలోకి చేరడం తీవ్ర చర్చకు దారితీసింది.

తెలంగాణలోని 3.38 కోట్ల మంది ఓటర్ల జాబితా ఆధారంగా సాగిన ఈ ప్రక్రియలో అత్యంత విస్మయపరిచే విషయాలు వెలుగుచూశాయి. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి లభించని ‘అన్‌కలెక్టబుల్’ వర్గం కింద ఏకంగా 73,47,053 ఓట్లు (మొత్తం ఓటర్లలో 21.72%) నమోదయ్యాయి. శాశ్వతంగా నివాసాలు మారిన వారు 45,21,608 మంది (13.37%) ఉండగా, చిరునామా లభించనివారు 11,30,166 మంది, మరణించిన ఓటర్లు 9,22,074 మంది, ఇతర చోట్ల నమోదైన డబుల్ ఓటర్లు 6,69,649 మంది ఉన్నారు. ఈ ప్రక్రియతో తెలంగాణ ముసాయిదా ఓటర్ల సంఖ్య 3.38 కోట్ల నుంచి ఒక్కసారిగా 2.65 కోట్లకు పడిపోనుంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 41.12%, మేడ్చల్-మల్కాజిగిరిలో 36.04%, రంగారెడ్డి జిల్లాలో 34.78% ఓట్లు అన్‌కలెక్టబుల్ కేటగిరీలోకి రావడం గమనార్హం.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన తనిఖీల్లో దాదాపు 44,71,523 ఓట్లను తొలగింపునకు అర్హమైనవిగా ఈసీ గుర్తించి రద్దు జాబితాలో చేర్చింది. గతంలో జరిగిన ఎన్నికల్లో బోగస్ ఓట్లపై ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఈ స్థాయిలో ఓట్ల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా నివాసాలు మారినా రికార్డుల్లో కొనసాగుతున్న వారు, సరైన లింకేజీ లేదా మ్యాపింగ్ లేని వారు, డబుల్ ఓట్లు ఉన్నవారు, మరణించిన వారి స్థానాల్లో కొనసాగుతున్న ఓట్లను అధికారులు రద్దు చేశారు.

రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లకు ఎదురైన సవాలు ‘నో మ్యాపింగ్’. 2002 నాటి SIR రికార్డులతో ప్రస్తుతం సమర్పించిన వివరాలు సరిపోలకపోవడాన్ని ‘నో మ్యాపింగ్’గా గుర్తించారు. తెలంగాణలో సుమారు 30% మంది ఓటర్లు ఈఆర్‌ఓల నోటీసుల పరిధిలోకి వచ్చారు. ఆధార్ లేదా రేషన్ కార్డులను పౌరసత్వ నిరూపణ పత్రాలుగా పరిగణించకపోవడం, ఇతర 11 గుర్తింపు పత్రాలనే అడగడం ఓటర్లకు ఇబ్బందికరంగా మారింది.

ఈ ప్రక్షాళన రాబోయే స్థానిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. నగరాల్లో వలస ఓటర్లు, ఐటీ వర్కింగ్ క్లాస్ ఓట్లు డిలీట్ కావడం క్షేత్రస్థాయి సమీకరణాలను మార్చివేస్తుంది. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన అనంతరం, నిజమైన ఓటర్లు ఎవరైనా తొలగింపునకు గురైతే వారు ఫారమ్-6 సమర్పించి తమ ఓటును తిరిగి పొందే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు.