ఏపీ సీఎం చంద్రబాబు మాటల్లో నిజమెంత?!
సూర్యలంక, బాపట్ల, చీరాల బీచ్‌లకు హైదరాబాదీలు వెళుతున్నారా?
నగరానికి బీచ్ లేని లోటును ఆంధ్రా బీచ్‌లు తీరుస్తున్నాయా?
ఈ బీచ్ టూరిజంతో రెండు రాష్ట్రాలకు ఒనగూరే ప్రయోజనం ఏంటి?
మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 10): వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ ఖాళీ అవుతోందనే ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దీన్ని కొంతమంది నెగిటీవ్ ప్రచారానికి వినియోగిస్తుంటే, మరికొందరు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోణంలో మాట్లాడుతున్నారు. కాస్త ప్రశాంతత కోసం, కుటుంబంతో గడపడానికి కొత్త ప్రాంతాల వైపు హైదరాబాదీలు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో బాపట్ల, చీరాల, సూర్యలంక బీచ్‌లను విజిట్ చేస్తున్న హైదరాబాదీల సంఖ్య ఎక్కువ అయ్యింది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తూ ప్రచారం చేసినప్పటికీ, దీని వెనుక ఉన్న అసలు సందేశం భిన్నమైనదని రాజకీయ, పర్యాటక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ కోణం కాదు… పర్యాటక ప్రోత్సాహం!
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఐటీ ఉద్యోగులు, కుటుంబాలు నిరంతరం బిజీ లైఫ్‌స్టైల్‌తో గడుపుతుంటారు. హైదరాబాద్‌కు అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నప్పటికీ ‘సముద్ర తీరం’ లేదనే వెలితి ఉంది. ఈ క్రమంలో, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఏపీ సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఒక ప్రధాన ‘‘వీకెండ్ గెట్‌అవే” డెస్టినేషన్‌గా మార్చాలన్నది సీఎం భావనగా స్పష్టమవుతోంది. ఈ ప్రసంగం వెనుక ఉన్న రెండు ప్రధాన ముఖ్యాంశాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా తెలుగు ప్రజలందరికీ ఏపీ అందమైన బీచ్‌లు స్వాగతం పలుకుతున్నాయనే సానుకూల ఆహ్వానం అందించడం, గతంలో ఏపీ నేతలు, ఐటీ డెవలప్‌మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లే వారని, ఇప్పుడు తెలంగాణ పర్యాటకులు రిఫ్రెష్ అవ్వడానికి ఏపీ బీచ్‌లకు వస్తున్నారని చెప్పడం ద్వారా పర్యాటక రంగానికి బూస్ట్ ఇవ్వడం.
సత్సంబంధాల దిశగా అడుగులు
రెండు సరిహద్దు రాష్ట్రాల మధ్య విద్వేషాల కంటే.. వ్యాపార, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారమే ముఖ్యం. హైదరాబాద్ నగరవాసులకు ఏపీ తీరప్రాంతాలు రీఫ్రెష్‌మెంట్ ఇస్తుంటే, ఏపీ పర్యాటక రంగానికి అది ఆర్థిక బలాన్నిస్తోంది. వివాదాలకు అతీతంగా, ఈ ‘బీచ్ టూరిజం’ రెండు రాష్ట్రాల మధ్య బంధాన్ని మరింత బలపరిచే పరిణామంగా మారడం శుభపరిణామమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
